భారత్‌తో సరిహద్దు విషయంలో నేపాల్ రోజురోజుకు మితిమీరుతోంది. కాలాపానీ తమదేనని ఇటీవలే కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. ఇప్పుడు మరో సరిహద్దు ప్రాంతమైన భిఖనటోడీ వద్ద నీటి సరఫరాను నిలిపివేసింది. ఫలితంగా బిహార్‌లోని 7 గ్రామాలకు చెందిన వేలాది రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ జరిగింది...
బిహార్‌లోని పశ్చిమ చెంపారన్కు చెందిన భిఖనటోడీ.. ఓ సరిహద్దు ప్రాంతం. నేపాల్ సరిహద్దులోని పిల్లర్ నెం. 435/1 నుంచి రెండు నాలాలు భారత్‌లోకి ప్రవహిస్తుంటాయి. వీటితో బిహార్‌లోని 7 గ్రామాల్లో వేలాది ఎకరాలకు నీటి సరఫరా జరిగేది. తాజాగా భారత్‌తో ఉద్రిక్తత నెలకొన్న తరుణంలో నేపాల్ యంత్రాంగంతో కలిసి రోడ్డు కాంట్రాక్టర్లు ఒక నాలాను పూడ్చివేశారు. ఫలితంగా భారత్‌కు నీటి సరఫరా నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని నేపాల్ అధికారులతో చర్చలు జరిపారు. ఈ చర్యకు గల కారణాలను వివరించడానికి ప్రయత్నించారు నేపాల్ అధికారులు. వంతెన నిర్మాణానికి అడ్డువస్తోందనే.. ఓ నాలను మూసివేసినట్టు... మిగిలిన నాలానే నీటి సరఫరాకు ఉపయోగించుకోవాలని తేల్చిచెప్పారు.
దీంతో ఆగ్రహించిన వేలాది మంది రైతులు సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నారు. అన్ని నాలాల నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
భిఖనటోడీ సరిహద్దులో అనేక మార్లు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి 2013లో నీటిసరఫరాపై ఓ ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం పండాయ నది నుంచి 30 శాతం నీటిని భారత్‌కు వదలాలి.