పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ భారీ ర్యాలీ నిర్వహించారు. జైపూర్‌లో 'సంవిధాన్ బచావో' పేరిట నిర్వహించిన ఈ ర్యాలీలో సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీ, సమాజ్‌వాదీ, ఆర్ఎల్డీ, జేడీఎస్ పార్టీలు ఒక్కటై భాజపా విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. నగరంలోని అల్బర్ట్ హాల్ నుంచి గాంధీ సర్కిల్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో దాదాపు 3 లక్షల మంది ప్రజలు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.
'హిందూ దేశంగా మార్చాలని చూస్తున్నారు'
ఈ సందర్భంగా నరేంద్ర మోదీ, భాజపా, ఆరెస్సెస్‌లపై గహ్లోత్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మతప్రాతిపదికన ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పౌరసత్వ చట్ట సవరణను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భారత్‌ను హిందూ దేశంగా మార్చే అజెండాలో భాగంగానే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు.
"వారు(భాజపా) అహంకారంతో పాలన చేస్తున్నారు. వారికున్న మెజారిటీతో చట్టాలు తీసుకురాగలరు. కానీ ప్రజల హృదయాలను గెలుచుకోలేరు. ఉత్తర్‌ప్రదేశ్‌లో వివిధ ఘటనల్లో 15 మంది మరణించారు. భాజపా పాలిస్తున్న ప్రతీచోట హింస జరుగుతోంది. 70ఏళ్లుగా దేశం రాజ్యాంగ సూత్రాలను పాటిస్తూ వస్తోంది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ముక్కలు చేస్తోంది. భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు ఆరెస్సెస్, భాజపాలు ప్రయత్నిస్తున్నాయి. అసోంలో ఎన్ఆర్సీ సర్వేలో గుర్తించిన 19 లక్షలమందిలో 16లక్షలమంది హిందువులే ఉన్నారు. ఎన్ఆర్సీ విజయవంతం కానప్పటికీ పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొచ్చారు."-అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి.
రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దేశంలోని అసలు సమస్యలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. యువత మొత్తం ఇప్పుడు రోడ్లపైకి వచ్చారని అన్నారు. ప్రభుత్వానికి రైతులు, యువతే ప్రాధాన్యంగా ఉండాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'పిల్లలు ఆడుకునే బొమ్మలు 67% ప్రమాదకరమైనవే'