నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన 15 మంది నేతల బృందం.. తమ అధినేత ఫరూక్ అబ్దుల్లాను శ్రీనగర్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి ఆయనను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది.
ఫరూక్‌ను కలిసేందుకు శ్రీనగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు పార్టీ నేతలు. ఫరూక్ అబ్దుల్లా ఆయన భార్య మోల్లీ అబ్దుల్లాతో కలసి వారికి స్వాగతం పలికారు. మీడియాకు విజయ సంకేతం చూపిస్తూ.. అబ్దుల్లా లోపలికి వెళ్లారు.
పార్టీ నేతలు.. ఫరూక్‌ను కలిసే ముందు మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించేలా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
"మేము మోసపోయాం. ఆర్టికల్ 370 పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నాం. ఆగస్టు 5కు ముందు కశ్మీర్ ఎలా ఉందో.. తిరిగి అలా మారాలి. ఇలాంటి నిర్ణయాలను తీసుకునేముందు కేంద్రం రాజ్యాంగాన్ని పరిశీలించి ఉండాల్సింది. 370 రద్దుతో రాజ్యాంగంపై దాడి చేశారు. రాష్ట్ర ప్రజలు, స్థానిక నేతల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు."
- ఎన్సీ బృందం
ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కశ్మీర్లో రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకునే ముందే.. రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు విధించింది. ముఖ్యనేతలైన ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని గృహనిర్బంధం చేసింది.
- ఇదీ చూడండి: కుక్క కాటుకు 'శునకాలయం'లో పూజలతో చికిత్స!