భారత నౌకాదళం సరికొత్త చరిత్ర లిఖించేందుకు సిద్ధమైంది. తొలిసారిగా శిక్షణ పూర్తి చేసుకున్న ముగ్గురు మహిళా పైలట్లను కీలకమైన సముద్ర నిఘా విధుల్లోకి పంపనుంది. లెఫ్టినెంట్ దివ్య శర్మ, లెఫ్టినెంట్ శుభంగి స్వరూప్, లెఫ్టినెంట్ శివాంగి.. నౌకాదళానికి చెందిన డోర్నియర్ యుద్ధ విమానం ద్వారా సముద్ర ఉపరితలంపై నిఘా విధులు నిర్వహించనున్నారు.

ఇప్పటికే దక్షిణ నౌకాదళ కమాండ్‌లో డోర్నియర్‌పై అన్నిరకాల శిక్షణలు పూర్తి చేసుకున్న ఈ ముగ్గురు పైలెట్లు.. మారిటైమ్ మిషన్‌లను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మొత్తం ఆరుగురు డోర్నియర్ కోర్సు(డీఓఎఫ్‌టీ) తీసుకోగా.. అందులో ముగ్గురు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసినట్లు రేర్ అడ్మిరల్ ఆంటోని జార్జ్ తెలిపారు.

తొలుత.. బిహార్‌కు చెందిన లెఫ్టినెంట్ శివాంగి గతేడాది డిసెంబర్‌లో ఈ కోర్సును విజయంతంగా పూర్తి చేశారు. 15 రోజుల అనంతరం లెఫ్టినెంట్ శుభంగి స్వరూప్, లెఫ్టినెంట్ దివ్య శర్మలు శిక్షణను పూర్తి చేశారు.
ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా ఔదార్యం.. ఆ మహిళలకు పడవలు