గోవాలో... భారత నావికాదళానికి చెందిన మిగ్-29కే యుద్ధ విమానం కుప్పకూలింది. శిక్షణా కేంద్రం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానం కూలింది. ఇంజిన్లో మంటలు చెలరేగడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లు.. కెప్టెన్ ఎమ్ షియోఖండ్, లెఫ్టినెంట్ కమాండర్ దీపక్ యాదవ్ సురక్షితంగా బయటపడ్డారనిపేర్కొన్నారు. ప్రాథమిక చికిత్స కోసం పైలట్లను వాస్కోలోని అసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఘటనాస్థలంలో ఓ పక్షి మృతదేహంతో పాటు కాలుతున్న ఇంజిన్ కనపడిందని అధికారులు వివరించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ప్రమాద సమయంలో పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి విమానం రద్దీ ప్రదేశంలో కూలకుండా జాగ్రత్తపడ్డారని స్పష్టం చేశారు.
"తక్కువ ఎత్తులో ఉండటం వల్ల ప్రమాదం నుంచి తప్పించడం కష్టమైంది. పైలట్లు తమ చాకచక్యంతో ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతం నుంచి విమానాన్ని పక్కకి తీసుకెళ్లారు. అనంతరం సురక్షితంగా బయటపడ్డారు. ఆ ఘటనలో ఎవరికీ హాని జరగలేదు."
--- రక్షణశాఖ ప్రకటన.
వెర్ణ గ్రామానికి15 కిలోమీటర్ల దూరంలో ఆ ఘటన జరిగిందని ఓ గ్రామస్థుడు తెలిపాడు. ఘటన జరిగిన అనంతరం ఒక కిలోమీటర్ మేర వ్యర్థాలు వ్యాపించాయని వివరించాడు.
రాజ్నాథ్ స్పందన...
మిగ్-29కే యుద్ధ విమానం కూలిన ఘటనపై రక్షణమంత్రి రాజ్నాథ్ స్పందించారు. ఇద్దరు పైలట్లతో మాట్లాడినట్లు తెలిపారు. సరైన సమయంలో విమానం నుంచి బయటపడటం సంతోషకరమన్నారు.