ఆపరేషన్ సముద్రసేతులో భాగంగా మాల్దీవుల నుంచి ఐఎన్ఎస్ జలాశ్వ ద్వారా 698 మంది భారత పౌరులు కేరళలోని కొచ్చికి చేరుకున్నారు. ఇందులో 19 మంది గర్భిణీలు.
వందేభారత్...
కొవిడ్-19 కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఉన్న ఆంక్షలతో బ్రిటన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో 326 మంది ఇవాళ ముంబయి చేరుకున్నారు. లండన్ నుంచి శనివారం బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానం.. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
వీరిలో కరోనా లక్షణాలు ఉన్న వారిని ఐసొలేషన్ కేంద్రాలకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. లక్షణాలు లేని వారిని హోటళ్లలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు పంపించనున్నారు.
మిగతా దేశాల నుంచి...
- మలేసియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 177 మంది భారతీయులు తమిళనాడులోని తిరుచిరాపల్లికి చేరుకున్నారు.
- వందే భారత్ మిషన్‌లో భాగంగా అమెరికాలోని భారతీయుల్ని తరలించే తొలి విమానం.. శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరింది.
- ఏఐ-343 విమానం సింగపూర్ నుంచి 243 మంది భారతీయుల్ని తరలిస్తోంది.
- ఉజ్బెకిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులు.. ప్రత్యేక విమానం ద్వారా ఇవాళ దిల్లీ చేరుకోనున్నారు.
- ఫిలిప్పీన్స్‌లోని మనీలా ఎయిర్పోర్ట్ నుంచి కూడా భారతీయులు ఇవాళ స్వదేశానికి రానున్నారు.
లాక్డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని తరలించేందుకు కేంద్రం వందే భారత్ మిషన్, ఆపరేషన్ సముద్ర సేతులను ప్రారంభించింది. ప్రత్యేక విమానాలు, నౌకల ద్వారా స్వదేశానికి తరలిస్తోంది. మే నెల 7-13 మధ్య దశలవారీగా మొత్తం 64 విమానాల్లో దాదాపు 15 వేల మందిని విదేశాల నుంచి తీసుకురానుంది కేంద్రం.