కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానంపై ఏ వర్గమూ అసంతృప్తి వ్యక్తం చేయలేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఉన్నత విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలపై ప్రసంగించిన ప్రధాని.. ఇది సంతోషకరమైన విషయమని చెప్పారు. నిశిత పరిశీలన, ఆలోచన విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
"గతంలో ఉన్న శిక్షణ వ్యవస్థ పూర్తి సాధికారత సాధించలేదు. కొత్త విద్యా విధానం గత సవాళ్లను ఎదుర్కొంటుందనే నమ్మకం ఉంది. పిల్లలు ఐదో తరగతి వరకు మాతృభాషలోనే చదువుకునే వెసులుబాటు ఉంటుంది. నూతన విధానంలో పిల్లల మనో వికాసం మరింత వృద్ధి చెందుతుంది. ప్రస్తుత విధానంలో పిల్లలకు సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. విద్యార్థులు చదవాల్సిన పుస్తకాలు చాలా ఉంటున్నాయి. దాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాం."
- నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి
పిల్లలు నేర్చుకునేందుకు చర్చ, అన్వేషణ, విశ్లేషణతో కూడిన విద్య అవసరమని మోదీ అన్నారు. తరగతి గదిలో వారి భాగస్వామ్యం మెరుగుపర్చుకోవాలని సూచించారు. కొత్త విధానంతో విద్యార్థులు తమ ఇష్టమైన విద్యలో నైపుణ్యాలు పెంచుకునే వీలు ఉంటుందని చెప్పారు. అయితే నూతన విద్యా విధానం అమలు సవాల్‌తో కూడుకున్నదని ప్రధాని వ్యాఖ్యానించారు.
"లక్షల సూచనలు, 3,4 ఏళ్లుగా చర్చించి కొత్త విధానాన్ని తీసుకొచ్చాం. ప్రస్తుతం ఈ విధానంపై దేశమంతా చర్చిస్తోంది. దీనిపై ఎంత ఎక్కువగా చర్చలు జరిగితే అంత ప్రయోజనం ఉంటుంది. 21వ శతాబ్దంలో యువతకు నైపుణ్యాలు ఎంతో అవసరం. దేశ అభివృద్ధికి విద్యా విధానంలో మార్పులు రావాలి. ఆ మార్పే జాతి నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుంది. "
- నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి
ఇవీ చూడండి: