కరోనా కాలంలో రైతులు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూలీల కోసం అదనపు వ్యయం, కీటకాలు, తెగుళ్ల నుంచి పంటలను రక్షించుకోడానికి యూరియా, రసాయన ఎరువులు వాడకం వల్ల ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. ఇలాంటి సమయంలోనూ ఓ రైతుకు కొత్తిమీర పండిస్తే అది సిరులు కురిపించింది.
4 ఎకరాల్లోనే...
మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన వినాయక్ హిమేడ్ అనే రైతు కొత్తి మీర పంట అమ్మగా.. 12 లక్షల 50 వేల ధర పలికింది. నాలుగు ఎగరాల్లో ఈ పంటను సాగు చేయగా.. భారీగా లాభం అర్జించారు.
సిన్నార్ తాలూకా, నందూర్ షింగోతే ప్రాంతానికి చెందిన వినాయక్.. తన నాలుగెకరాల పంటపొలంలో 45 కిలోల కొత్తిమీర విత్తనాలను చల్లారు. దానికి ఎటువంటి రసాయన ఎరువులు వాడలేదు. ఆవు పేడతోనే సహజ ఎరువును తయారు చేసి.. పంటకు చల్లారు. అలా సేంద్రీయ పద్ధతిలో పండించిన ఆ పంటకు ఊహించని ధర పలికింది.
"నాలుగెకరాల్లో కొత్తమీర పంట చేతికొచ్చాక నా దశ మారిపోయింది. నేను వేసిన పంటను నా స్నేహితుడు, వ్యాపారి శివాజీ కత్రూకి అమ్మాను. నేను ఆవులు పెంచడం వల్ల నాకు పంట సారం పెంచేందుకు రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం రాలేదు. రసాయనాలు వాడకుండా ఈ పద్ధతులు ఏ రైతు పాటించినా కచ్చితంగా ఆశించిన ఫలితాలు వస్తాయి"
-వినాయక్ హిమేడ్
ప్రస్తుతం వినాయక్ వద్ద 13 ఆవులు ఉన్నాయి. అవి రోజులు దాదాపు 100 లీటర్ల పాలు ఇస్తున్నాయి. వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమనూ రైతులు అభివృద్ధి చేసుకుంటే లాభదాయకంగా ఉంటుందని వినాయక్ సూచిస్తున్నారు.