అగ్రరాజ్య అధినేతకు ఘనంగా ఆతిథ్యమిచ్చేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. ఈనెల 24, 25న జరగనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
ట్రంప్ రాకతో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని విశ్లేషకుల అంచనా. వాణిజ్యం, రక్షణ, అంతరిక్షం సహా పలు రంగాల్లో కీలక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ట్రంప్ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు...
- ఫిబ్రవరి 24న అహ్మదాబాద్ చేరుకోనున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఘన స్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. విమానాశ్రయానికి ట్రంప్ చేరుకోగానే ప్రధాని మోదీ భారత త్రివర్ణ పతాకాన్ని ఊపి ఆయనకు స్వాగతం పలుకుతారు.
- అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 22 కి.మీ భారీ రోడ్ షో కు సన్నాహాలు చేస్తోంది. విమానాశ్రయం నుంచి ట్రంప్‌ను ముందుగా గాంధీ ఆశ్రమానికి, తర్వాత మోటేరా స్టేడియానికి తీసుకువెళతారు మోదీ.
- వివిధ మతాలు, సంస్థలకు చెందిన 300 మంది ప్రతినిధులు ఈ రోడ్ షో ను విజయవంతం చేయడానికి ప్రజలను సమీకరిస్తున్నారు. ఇందులో పాల్గొనేవారు వారి మతవిశ్వాసాలకు అనుగుణంగా సంప్రదాయ వస్త్రాలతో కనువిందు చేయనున్నారు.
- వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ రోడ్ షోకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందిరా వంతెన నుంచి కొత్తగా నిర్మితమైన మోటేరా స్టేడియం వరకు ఈ రోడ్ షో సాగనుంది.
- 50,000 మందికిపైగా ఈ రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉంది. 22 కి.మీ పొడవునా మొత్తం 28 ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేయనున్నారు. 28 రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయ జానపద నృత్యాలు, పాటలతో ఆకట్టుకోనున్నారు.
- జానపద నృత్యగీతాల ద్వారా భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించడమే రోడ్ షో ముఖ్య ఉద్దేశం. 'భిన్నత్వంలో ఏకత్వం' అనే భారత సూత్రానికి ఈ రోడ్ షో ప్రతీకగా నిలవనుంది.
- ఈ రోడ్ షోలో పాల్గొనేవారు తమ చేతిలో భారత్, అమెరికా జాతీయ జెండాలను పట్టుకుంటారు.
- రూ. 4 కోట్లను ఖర్చు చేసి మోదీ-ట్రంప్ రోడ్‌షోలో ఎటు చూసినా హరితవర్ణమే కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లక్షకు పైగా వివిధ రకాల మొక్కలను రోడ్ షో నిర్వహించే ప్రాంతాల్లో నాటుతోంది.
- మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది.. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కడా దుమ్ము, రాళ్లు కనిపించకుండా జాగ్రత్తపడతున్నారు.
- రోడ్‌షో ముగిశాక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ.. మోటేరా స్టేడియంను ప్రారంభిస్తారు.
- గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ దగ్గరుండి మోటేరా స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ పనులు వేగవంతం చేయిస్తున్నారు.
- ఇదీ చూడండి: అజేయ 'హైపర్' ఆయుధాలు భారత్‌కు ఉపయోగమేనా?