దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సవాళ్ల పరిష్కారానికి యువత వినూత్నంగా ఆలోచించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అందుకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. లాక్డౌన్ సమయంలో వలస కూలీలు పడిన అవస్థను గుర్తు చేసిన ఆయన.. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ఉపాధి, ఆర్థిక అవకాశాలను సృష్టించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
'40 ఇయర్స్ విత్ కలాం-అన్టోల్డ్ స్టోరీస్' అనే పుస్తకాన్ని వర్చువల్ విధానంలో ఆవిష్కరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు వెంకయ్య.
"అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళికలతో స్థానిక సంస్థల సామర్థ్యాన్ని పెంచాలి. కుటీర పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడంపై దృష్టి సారించాలి. తద్వారా మన గ్రామాలు, పట్టణాలు వృద్ధి కేంద్రాలుగా మారతాయి."
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
కలాం ఓ కర్మయోగి..
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఓ కర్మయోగి అని వెంకయ్య నాయుడు కొనియాడారు. భారతదేశం రక్షణ, అంతరిక్ష సామర్థ్యాలను బలోపేతం చేయడంలో కలాం కృషి అమూల్యమైనదని అన్నారు. ఈ క్రమంలో ఆయనతో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.