బంగాల్ పర్యటనలో ఉన్న భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వాహనశ్రేణిపై రాళ్లదాడి జరగడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. టీఎంసీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ మద్దతుతో జరిగిన దాడిపై దీదీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలకు ప్రతిబింబం అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దుయ్యబట్టారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
"ప్రజాస్వామ్యంలో రాజకీయ నేతలపై ఈ రకమైన దాడులు జరగడం చాలా ఆందోళనకరం. జేపీ నడ్డాపై జరిగిన దాడి తీవ్రత దృష్టిలో ఉంచుకొని.. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాలి. దీనికి బాధ్యులైనవారిని గుర్తించాలి."
-రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిని కోరుకునే ప్రజలకు బంగాల్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.
"తృణమూల్ పాలనలో బంగాల్.. దౌర్జన్య, అరాచక, చీకటి శకంలోకి వెళ్లిపోయింది. రాజకీయ హింస ఇంతటి తీవ్ర స్థాయికి చేరడం బాధాకరమే కాక ఆందోళనకరం."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. నడ్డాతో పాటు, పార్టీ నేత కైలాశ్ విజయ వర్గీయపై జరిగిన దాడిని దుర్భరమైన చర్యగా అభివర్ణించారు. బంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయని విరుచుకుపడ్డారు. ఈ దాడి వెనక ఉన్న 'గూండా'లను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఘటనపై స్పందించిన నడ్డా.. రాష్ట్రం పూర్తిగా గూండా రాజ్యంలోకి ప్రవేశించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఈ రోజు నేను ఎదుర్కొన్న సంఘటన ఆశ్చర్యకరమైనది, ఊహించనటువంటింది. రాష్ట్రంలో అసహనం, అన్యాయం పెరిగిపోయింది. రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. గూండాలే రాజ్యమేలుతున్నారు."
-జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు
తనలాంటి వారికే రాష్ట్రంలోకి వచ్చేందుకు ఇలాంటి పరిస్థితి ఉంటే సాధారణ కార్యకర్తల పరిస్థితి అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు నడ్డా. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ప్రయాణిస్తున్నందున తనకు ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఇతర భాజపా నాయకులు గాయపడ్డట్లు తెలిపారు. రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. గూండాల పాలనను ఓడిస్తామని స్పష్టం చేశారు.
"ఈ రోజు జరిగిన దాడిలో ముకుల్ రాయ్, కైలాశ్ విజయవర్గీయ గాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి అవమానకరం. మా కాన్వాయ్‌లో దాడికి గురికాని కారు లేదు. బంగాల్లో అసహనం, అన్యాయాలు అంతం కావాల్సిందే. గూండా పాలన కొనసాగించేందుకు అనుమతి లేదు."
-జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు
అప్రమత్తం చేశా: గవర్నర్
బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ సైతం ఈ దాడిపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీని తాను అప్రమత్తం చేసినప్పటికీ.. ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. తమ అధికారాన్ని త్యజించడాన్ని ఈ ఘటన సూచిస్తోందని వ్యాఖ్యానించారు.
"నడ్డా పర్యటన నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని గురువారం 8.19 గంటలకు, 9.05 గంటలకు రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాను. డీజీపీకి సమాచారం అందించానని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాకు చెప్పారు. కానీ ఇలాంటి ఘటనలు అధికారాన్ని వదులుకోవడాన్ని సూచిస్తాయి. డైమండ్ హార్బర్ ఎస్పీ ప్రభుత్వ సేవకుడిగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. రాజ్యాంగ పరిరక్షకుడిగా నా అవమానాన్ని మీతో(అధికారులనుద్దేశించి) పంచుకుంటున్నాను."
-జగదీప్ ధన్కర్, బంగాల్ గవర్నర్
'భాజపా వాళ్లే దాడి చేసుకున్నారు'
అయితే భాజపా ఆరోపణలను బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. భాజపా కార్యకర్తలే దాడి చేసుకున్నారని అన్నారు.
"ప్రతి రోజు వీరంతా(భాజపా కార్యకర్తలు) ఆయుధాలతో బయట(ర్యాలీ)కి వచ్చి.. వారిపై వారే దాడి చేసుకుంటున్నారు. దీనికి తృణమూల్ కాంగ్రెస్‌పై నిందలు మోపుతున్నారు. ఆర్మీ, కేంద్ర ప్రభుత్వ బలగాల నీడలో తిరిగే మీరు ఎందుకు అంత భయపడుతున్నారు?"
-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
మరోవైపు టీఎంసీ పార్టీ సైతం భాజపా వ్యాఖ్యలను ఖండించింది. రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు భాజపా కార్యకర్తలే దాడిచేసుకున్నారని తమకు సమాచారం అందిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సుబ్రతా ముఖర్జీ పేర్కొన్నారు. ఈ తతంగం అంతా భాజపా ప్రణాళిక ప్రకారం చేసిందని ఆరోపించారు. భాజపా విసిరిన వలలో పడొద్దని టీఎంసీ కార్యకర్తలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పత్రం విడుదల కార్యక్రమం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ప్రయత్నాలు చేశారని దుయ్యబట్టారు.