దేశ రాజకీయ సంస్కృతిని ప్రధాని నరేంద్రమోదీ మార్చారని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసించారు. ఎలాంటి ఒత్తిడికి తలొగ్గకుండా నిలిచారని, బలహీన వర్గాల హక్కుల కోసం కృషి చేశారని కొనియాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు ఆయన సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు.
దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో పార్టీ అధికారిక పత్రిక 'కమల్ సందేశ్' ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు నడ్డా. ఈ సంచికలో మోదీకి సంబంధించి విషయాలను ప్రచురించారు. ఈ సందర్భంగా సంస్కరణలపై మాట్లాడిన నడ్డా.. వ్యవసాయ బిల్లులతో రైతులు సాధికారిత సాధిస్తారని, దళారుల చెర నుంచి విముక్తులవుతారని స్పష్టం చేశారు.
తప్పుదోవ పట్టిస్తున్నాయ్..
మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలతో రైతులు లాభపడతారని నడ్డా తెలిపారు. కానీ, విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్ కూడా మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని నడ్డా గుర్తు చేశారు.
ఇదీ చూడండి: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుల్లో ఏముందంటే?