రాజస్థాన్లోని సాంచోర్ గ్రామంలో ఆకాశం నుంచి అనుమానాస్పద వస్తువేదో భారీ శబ్దంతో నేలపై పడింది. ఆ ధ్వని ధాటికి స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోయారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు. భయపడాల్సిందేమీ లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఆకాశం నుంచి పడిన అనుమానాస్పద వస్తువును కొందరు మోర్టార్(బాంబు) అని అనుమానిస్తున్నారు. మరికొందరేమో ఉల్క అని భావిస్తున్నారు. దాని శబ్దం హెలికాప్టర్లానే ఉందని స్థానికులు తెలిపారు. ఆ వస్తువు భూమిపై పడినప్పుడు చుట్టుపక్కల 2 కి.మీ వరకు శబ్దం వినిపించినట్లు చెప్పారు.

శుక్రవారం ఉదయం 6:15 గంటలకు బర్సం బైపాస్ పులియా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సబ్ డివిజన్ అధికారి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఆకాశం నుంచి పడిన వస్తువు నుంచి వేడి తరంగాలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. అది ఏంటనే విషయాన్ని కనుగొనేందుకు నిపుణుల బృందాన్ని రంగంలోకి దించనున్నట్లు పేర్కొన్నారు.
ఘటనా స్థలానికి ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు భూపేంద్ర యాదవ్. తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేయొద్దని కోరారు.