అసోంలోని ఓ దేవాలయం హిందూ-ముస్లింల ఐక్యతకు, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. 350 ఏళ్ల పురాతనమైన ఈ బిల్లేశ్వర దేవాలయంలో రోజూ జరిగే కార్యక్రమాల్లో ముస్లింలు భాగస్వాములు కావడం ఆనవాయితీగా వస్తోంది. పశ్చిమ అసోంలోని నల్బరి పట్టణానికి 10 కి.మీ దూరంలో ఉంది ఈ బిల్లేశ్వర దేవాలయం.
"బిల్లేశ్వర దేవాలయం ఎప్పుడు నిర్మించారో కచ్చితంగా చెప్పలేను. కానీ, నాగాక్ష రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈయన నరకాసురుడికి సమకాలీనుడు."
-రంజిత్ మిశ్రా, ఆలయ పూజారి
నవరాత్రుల నేపథ్యంలో దుర్గా పూజ కోసం ఈ ఆలయం సుందరంగా ముస్తాబవుతోంది. దీంతో ఇక్కడి ముస్లిం ప్రజల్లోనూ సంబరాలు మిన్నంటుతున్నాయి. ఇక్కడ దేవుడికి సమర్పించిన నైవేద్యంలో కొంత భాగాన్ని ముస్లింలకు పంచిపెడుతూ ఉంటారు. పండుగలు జరిగినప్పుడల్లా సమీపంలోని ముస్లింలు ఆలయ ఉత్సవాల్లో భాగమవుతుంటారు.
"రాజు ఇక్కడి భూమిని మా పూర్వీకులకు దానం చేసినప్పటి నుంచి ఆలయ ఉత్సవాల్లో పాల్గొంటున్నాం. దేవుడికి సమర్పించే నైవేద్యంలో కొంత భాగం ముస్లింలకు కేటాయించాలని రాజు గారు ఆదేశాలు జారీ చేశారు. ఆలయంలో వివాదాలు తలెత్తితే పరిష్కరించే బాధ్యత ముస్లింలకు అప్పగించారు. అందుకే మమ్మల్ని హుజురి అని పిలుస్తారు. అప్పటి నుంచి ఇదే సంబంధాన్ని కొనసాగిస్తున్నాం. ఇక్కడ హిందూ, ముస్లిం అనే తేడా ఉండదు. ఆలయ నిర్వాహక కమిటీలో ముస్లింలకు కూడా ప్రాతినిధ్యం ఉంది."
-హజి సోనాలీ, ఆలయ హుజురిబ్
ఇతర ప్రదేశాల్లో హిందూ-ముస్లింల మధ్య ఎన్ని విభేదాలు వచ్చినా ఇక్కడి మత సామరస్యం చెక్కుచెదరలేదు. వందల సంవత్సరాలుగా ఇరు వర్గాల మధ్య సోదరభావం కొనసాగుతూనే ఉంది.
ఇదీ చదవండి- గణేశుడు ఏకదంతుడు అయింది ఇక్కడే...