దక్షిణ ముంబయి డోంగ్రీలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 40 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తండెల్ వీధిలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో 100 ఏళ్ల నాటి కేసర్బాఘ్ భవనం అమాంతం కుప్పకూలిపోయింది. ఈ భవనాన్ని పునర్నిర్మాణం కోసం ఓ డెవలపర్‌కు ఇచ్చారని తెలుస్తోంది. శిథిలావస్థలో ఉన్నందున అవసరమైన చర్యలు చేపట్టాలని భవనంలో నివాసం ఉండేవారు ప్రభుత్వ అధికారులను కోరినప్పటికీ వారు సరిగా స్పందించలేదని సమాచారం.
ఘటన సమయంలో 15 కుటుంబాలకు చెందిన 40 నుంచి 50 మంది భవనంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు
ప్రమాద సమాచారం అందిన వెంటనే... జాతీయ విపత్తు నిర్వహణ దళం- ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించడమే లక్ష్యంగా అధునాతన సాంకేతికత, సామగ్రి సాయంతో సహాయ చర్యలు చేపట్టింది. స్థానికులూ వీరికి సహకరించారు.
ముందే హెచ్చరించిన నగర పాలిక
కేసర్బాఘ్ భవనం శిథిలావస్థకు చేరిందని బృహన్ ముంబయి పురపాలక సంస్థ (బీఎమ్సీ) 2017, ఆగస్టు 7నే హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన లేఖ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. భవనాన్ని కూల్చివేసేందుకు వీలుగా సాధ్యమైనంత త్వరగా ఖాళీ చేయాలని అప్పట్లోనే సూచించింది బీఎమ్సీ. అయినా ఆ హెచ్చరికలను యజమానులు పెడచెవిన పెట్టగా... పెను విషాదం జరిగింది.
మోదీ దిగ్భ్రాంతి...
ముంబయిలో భవనం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధితు కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
'భవనం భద్రతా నిబంధనల అమలు అవసరం'
డోంగ్రీలో కళ్లముందే భవనం కుప్పకూలిపోయిన కారణంగా ఇక మీదట భవన నిర్మాణాలకు కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. భవనాలు కుప్పకూలిపోవడం, పైవంతెనల్లో ప్రమాదాలు ప్రతి నెలా జరగడంపై ప్రభుత్వం విచారణ చేపట్టనుంది.
కుటుంబం కోసం వ్యక్తి నిరీక్షణ
భార్య, కుమారుడి కోసం ఓ వ్యక్తి ఆర్తనాదం పలువురిని కంటతడి పెట్టించింది. దిల్లీలో పనిచేసే నవాబ్ షామనీ కుటుంబాన్ని చూసేందుకు ముంబయికి వచ్చాడు. భవనం కుప్పకూలిపోయిన ఘటనలో ఆయన కుటుంబమూ ఉంది. తల్లికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో ఉంది. షామనీకి గాయలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నా భార్య, కుమారుడు ఇంకా శిథిలాల కిందే ఉన్నారని ఆయన చేసిన రోదన పలువురికి కంటతడి తెప్పించింది.
బిడ్డలను రక్షించుకుని..మృత్యువు కౌగిలిలోకి...!
డోంగ్రీ ఘటనలో ఓ తల్లి.. బిడ్డలను రక్షించుకుంది. కానీ తాను మృత్యు ఒడికి చేరింది. కేసర్బాఘ్ భవనంలోని మూడో అంతస్థులో నివాసం ఉంటున్న సాదియా తన ప్రాణాలు పణంగా పెట్టి బిడ్డలను రక్షించుకుంది. అనంతరం భవనం కుప్పకూలిపోయే దశలో శిథిలాలు మీదపడి మరణించింది. పిల్లలు మాత్రం తల్లి కింద సజీవంగా ఉన్నారు.
ఇదీ చూడండి: అసోం, బిహార్‌లో వరదల బీభత్సం.. 55 మంది మృతి