మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శివపురి జిల్లాలోని పోహ్రి వద్ద ఓ వ్యాన్ బోల్తా పడిన ఘటనలో 10 మంది మృతిచెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
షియోపూర్ జిల్లాలోని ఉన్‌వాడ్‌లోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని తమ సొంత గ్రామమైన దోడికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు శివపురి జిల్లా ఎస్పీ రాజేశ్ సింగ్ చండేల్ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. క్షతగాత్రులను శివపురి జిల్లాలోని ఆస్పత్రుల్లో చేర్పించినట్టు తెలిపారు.
ఆయిల్ ట్యాంకర్ పేలి మరో ముగ్గురు..
మరోవైపు, పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో ఆయిల్ ట్యాంకర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రోడ్డు పక్కనఓ తినుబండారాల దుకాణం వద్ద నిలిపి ఉంచిన సమయంలో ఒక్కసారిగా ట్యాంకర్ పేలింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.