అయోధ్య రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాద కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. త్వరలో తీర్పు రానున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఇప్పటికే అయోధ్యలో 144 సెక్షన్ విధించారు అధికారులు.
అయితే తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం శాంతి భద్రతల దృష్ట్యా అక్కడి పోలీసులకు సెలవలు రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
"మిలాద్ ఉన్ నబీ, గురునానక్ జయంతిలాంటి పర్వదినాలతో పాటు అయోధ్య కేసులోనూ త్వరలో తీర్పు వెలువడనుంది. దీంతో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని నవంబరు 1 నుంచి పోలీసు అధికారులు, సిబ్బంది ఎలాంటి సెలవులు తీసుకోకుండా నిషేధం అమల్లోకి వస్తుంది. మళ్లీ ఉత్తర్వులు వచ్చేంత వరకు పోలీసులు సెలవు పెట్టకూడదు"- ఉత్తర్వుల సారాంశం
అత్యవసర పరిస్థితుల్లో సెలవు తీసుకోవాల్సి వస్తే సీనియర్ల అనుమతి తీసుకోవాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
40 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం అయోధ్య భూవివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు దీపావళి సెలవులు. నవంబరు 4 నుంచి కోర్టులో రెగ్యులర్ విచారణలు మొదలవుతాయి. మరోవైపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నవంబరు 17న పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోగానే అయోధ్య కేసులో తీర్పు వెలువడే అవకాశముంది.
- ఇదీ చూడండి: ఐదేళ్లలో అసాధ్యాలను సుసాధ్యం చేశాం: మోదీ