లాక్డౌన్ వేళ లగ్జరీ కారులో ప్రయాణిస్తున్న ఓ యువకుడిని వాలంటీర్ అడ్డుకున్నాడు. అతడిని కారులో నుంచి కిందికి దింపి.. రోడ్డుపైనే గుంజీలు తీయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అయితే తన వద్ద పాస్ ఉన్నప్పటికీ ఆ వాలంటీర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆ వ్యక్తి ఆరోపించాడు.
ఇదీ జరిగింది...
నగర్ సురక్షా సమితి బృందంలోని ఓ వాలంటీర్.. 20ఏళ్ల వ్యక్తితో రోడ్డుపై గుంజీలు తీయించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
నల్ల దుస్తులు ధరించిన ఆ వాలంటీర్.. కారులో ఉన్న వ్యక్తిని కిందకి దిగమని అడగడం ఆ వీడియోలో కనపడింది. అదే సమయంలో ఆ యువకుడు తన వద్ద ఉన్న పాస్‌ను చూపించడం అందులో రికార్డ్ అయ్యింది.
తనకు పాస్‌తో సంబంధం లేదన్న ఆ వాలంటీర్.. చివరికి ఆ వ్యక్తి చేత గుంజీలు తీయించాడు. అతడి ముఖానికి మాస్కులు లేకపోవడం చూసి ప్రశ్నించాడు.
ఈ విషయంపై బాధితుడు మరో వీడియో తీసి వివరణ ఇచ్చాడు. తాను ఇండోర్‌లోని ఓ పారిశ్రామికవేత్త కుమారుడినని, తన వద్ద పాస్ ఉన్నట్టు చెప్పినప్పటికీ ఆ వాలంటీర్ వినలేదని ఆరోపించాడు. ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహార పొట్లాలను పంపిణీ చేసి ఇంటికి వెళ్తున్నట్టు చెప్పినా లెక్కచేయలేదన్నాడు. తనపై అసభ్య పదజాలం వాడినట్టు తెలిపాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ పారిశ్రామికవేత్త.. తనకు కూడా ఇలాంటి సంఘటనే ఎదురైందని చెప్పుకొచ్చారు. అప్పుడు కూడా నగర్ సురక్షా సమితి సభ్యులే తనపై అసభ్యకరంగా ప్రవర్తించారన్నారు. ఈ విషయాన్ని హీరా నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు స్పష్టం చేశారు.
ఈ పుర్తి వ్యవహారంపై హీరా నగర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రాజివ్ భడోరియా స్పందించారు. వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం తమకు అందిందన్నారు. వీడియోను పరిశీలించిన తర్వాతే చర్యలు చేపడతామన్నారు.
లాక్డౌన్ కారణంగా అనేకమంది నగర్ సురక్షా సమితి వాలంటీర్లతో పోలీసు సిబ్బంది కలిసి పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు భడోరియా. అయితే సామాన్యులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:- వాట్సాప్ స్టేటస్‌లో కరోనా బాధితుల ఫొటో- చివరికి..