తన ఇంటి నెలవారీ కరెంటు బిల్లు చూసి ఓ వినియోగదారుడు నిర్ఘాంతపోయాడు. సర్లే.. విద్యుత్ అధికారులను సంప్రదిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందనుకున్నాడు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. తీరా వాళ్లిచ్చిన సమాధానం చూసి అతడికి ఈసారి మైండ్‌బ్లాక్ అయింది. "కరెంటు బిల్లు తక్కువ కావాలంటే కాంగ్రెస్‌ను ఎన్నుకో" అని వారు చెప్పిన సమాధానానికి ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఏం జరిగింది?
అఘర్ మాల్వా జిల్లాకు చెందిన హరీష్ జాదవ్ అనే వినియోగదారుడికి మే నెల కరెంటు బిల్లు రూ.30వేలు వచ్చింది. దీంతో మధ్యప్రదేశ్ విద్యుత్‌శాఖ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేశాడు. వారు సమస్య నమోదు చేసుకొని ఓ ఐడీ ఇచ్చారు. తర్వాతి రోజు ఫిర్యాదు స్థితి కోసం వెబ్‌సైట్‌లో తనిఖీ చేయగా.. 'క్లోజ్' అయినట్లు సందేశం కనిపించింది.
దానికి కారణం ఏంటా అని చూస్తే... "మీకు తక్కువ మొత్తం కరెంట్ బిల్లు కావాలా? అయితే అధికారంలో ఉన్న భాజపాను దింపేసి, కాంగ్రెస్‌ను ఎన్నుకోండి. అప్పుడు మీ బిల్లు ₹100 వస్తుంది" అని ఉంది. దీంతో కంగుతిన్న జాదవ్ ఈసారి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో పాటు, కలెక్టర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన అధికారులు..అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని బాధ్యుడిగా పరిగణించి సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.
ఇదీచూడండి: ఆ సింహాల్ని పిలిచినా పట్టించుకోలేదు!