మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు ఈ నెల 3న జరిగిన ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించి భాజపా తీర్థం పుచ్చుకున్న 'జోతిరాదిత్య సింధియా' వర్గం భవితవ్యం ఈ ఫలితంతో తేలనుంది.
మొత్తం 19 జిల్లాల్లో మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు చేపట్టింది. ఈసీ సూచనల మేరకు.. కేవలం ఎన్నికల అభ్యర్థులు.. వారి పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే కేంద్రాల వద్ద ఉండాలి. ఫలితాలను కూడా కేంద్రాల బయట ఏర్పాటు చేసిన స్క్రీన్ల మీద ప్రదర్శిస్తారు.
ఇదీ చూడండి:- 'మార్పు' పవనాల మధ్య కౌంటింగ్‌కు బిహార్ సిద్ధం
కమల్‌నాథ్- సింధియాకు 'పరీక్ష'
ఈ ఉపఎన్నికలు కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్- భాజపా యువనేత జోతిరాదిత్య సింధియాకు అసలైన పరీక్ష. 7 నెలల క్రితం.. కమల్‌నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కుప్పకూల్చి.. భాజపా గూటికి చేరింది సింధియా వర్గం. ఫలితంగా ఖాళీలు ఏర్పడ్డ 25 స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో మరో 3 నియోజకవర్గాలు ఈ జాబితాలో చేరాయి.
ఉపఎన్నికలను ఈ ఇరువురు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ఉపపోరును తన ప్రతిష్ఠకు సంబంధించిన విషయంగా తీసుకున్నారు కమల్‌నాథ్. ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగించారు. కాంగ్రెస్ తరఫున అన్ని తానై నడిపించారు.
230 సీట్లున్న మధ్యప్రదేశ్ శాసనసభలో ప్రస్తుతం భాజపాకు 107, కాంగ్రెస్‌కు 87మంది ఎమ్మెల్యేలున్నారు. మ్యాజికల్ ఫిగర్‌ను చేరుకోవాలంటే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని భాజపాకు మరో 8 సీట్లు దక్కితే చాలు. అయితే 28స్థానాల్లో అత్యధికంగా గెలిస్తే అసెంబ్లీలో కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకునే అవకాశముంటుంది.
ఇదీ చూడండి:- 'హస్తంకు ఓటేయండి'.. భాజపా ప్రచారంలో సింథియా!