లేహ్‌కు చెందిన 33 ఏళ్ల జిక్‌మెట్ వాంగ్డూస్‌కు బెంగళూరులో ఉద్యోగం. భార్య డోర్జి లేహ్‌లో ఉంటారు. జూన్ 16న ఆమె అక్కడే మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే తన రొమ్ము నుంచి బాబు పాలను తీసుకోలేకపోతున్నాడని గ్రహించి, వెంటనే వాంగ్డూస్‌కు విషయం తెలిపింది. మెరుగైన వైద్యం కోసం బాబును దిల్లీ లేదా చండీగఢ్‌లోని ఆస్పత్రులకు తరలించాలని వాంగ్డూస్‌కు సూచించారు స్నేహితులు. జూన్ 18న డోర్జి తమ్ముడు సదరు బాబును తీసుకుని విమానంలో దిల్లీ చేరుకున్నారు. బెంగళూరు నుంచి వాంగ్డూస్ కూడా దిల్లీ వెళ్లారు.
రోజూ విమానంలో అమ్మపాలు..
అక్కడ బాబుకు విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగిన అనంతరం.. బిడ్డకు తల్లిపాలు కావాలని వైద్యులు సూచించారు. 'నాకేం అర్థం కాలేదు. వైద్యులేమో అమ్మ పాలు కావాలన్నారు. భార్యేమో లేహ్‌లో ఉంది. సీజేరియన్ చికిత్స జరగడంతో ఆమె ఆరోగ్యం కూడా సరిగా లేదు. దీనికి తోడు కరోనా భయం. ఏం చేయాలో తోచలేదు. లేహ్ విమానాశ్రయంలోని స్నేహితులను సంప్రదించా. వారి కృషి ఫలించింది. లేహ్, దిల్లీ మధ్య రోజూ విమానం నడిపే ఓ ప్రైవేటు విమానయాన సంస్థ సాయం చేసేందుకు ముందుకొచ్చింది. డోర్జి చనుపాలను ఉచితంగా దిల్లీ చేర్చడానికి అంగీకరించింది. అప్పటి నుంచి దిల్లీ విమానాశ్రయానికి వచ్చి ఆ పాలను తీసుకుంటున్నాం. నెలరోజులు గడిచాయి. బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. శుక్రవారమే బాబుతో సహా లేహ్‌కు తిరిగి వెళుతున్నాం.' అని వాంగ్డూస్ అనందంతో చెప్పాడు.
ఇదీ చదవండి: ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ బాగుంది.. కానీ?