మనుషులు-ఏనుగుల మధ్య ఘర్షణలో ఏటా వందకుపైగా గజరాజులు, 500 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది కేంద్ర పర్యావరణ శాఖ. ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ గణాంకాలు విడుదల చేసింది.
ఏనుగులు- మనుషుల ఘర్షణలను తగ్గించే ఉత్తమ పద్ధతులపై పుస్తకాన్ని విడుదల చేశారు పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్. జాతీయ స్థాయిలో వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఏనుగులను రక్షించేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.
![elephants die every year due to conflict](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8366647_292_8366647_1597060665839.png)
" ఏనుగులు-మనుషుల మధ్య ఘర్షణ తీవ్రమైన సమస్య. గజరాజులను సంరక్షించటం చాలా అవసరం. దాంతో పర్యావరణ వ్యవస్థ సమతుల్యమవుతుంది. ఏనుగులను అడవులలోనే ఉంచాలి. దాని కోసం పశుగ్రాసం, నీటి లభ్యతకు కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాం. వచ్చే ఏడాది నాటికి ఈ కార్యక్రమం ఫలితాలు అందుతాయి."
- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి.
కేరళ ఘటనను ఖండించిన మంత్రి..
మే 27న కేరళలో గర్భంతో ఉన్న ఓ ఏనుగు పేలుడు పదార్థాలను తిని మృతి చెందిన ఘటనను తీవ్రంగా ఖండించారు పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో. 'ఏనుగులను రక్షించుకోవాలి. కేరళ ఘటన అమానవీయం, అలాంటి నేరాలను సహించబోం. దోషులను కఠినంగా శిక్షించాలి' అని అన్నారు.
30 శాతం బడ్జెట్ పెంపు..
దేశంలోని ఏనుగులను సంరక్షించేందుకు గత ఐదేళ్లుగా పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోందన్నారు అదనపు డైరెక్టర్ జనరల్ (అటవీ) సౌమిత్ర దాస్‌గుప్తా. మరిన్ని ఏనుగుల కారిడార్లను గుర్తించినట్లు చెప్పారు. గజరాజుల సంరక్షణ కోసం బడ్జెట్‌ను 30 శాతం పెంచటం సహా పలు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
2017లో నిర్వహించిన ఏనుగుల గణన ప్రకారం దేశంలో 30 వేలు గజరాజులు ఉన్నాయి.
ఇదీ చూడండి:పక్షుల కోసం మూడెకరాల్లో జొన్న పంట!