రెండు ముంగిసలను చంపి చెట్టుకు వేలాడేసిన ఘటన కేరళలో కలకలం సృష్టిస్తోంది. ఈ దారుణానికి పాల్పడిన వారి వివరాలు ఇంకా తెలియలేదు. మూగ జీవులను ఉరి వేయడంపై సర్వత్రా ఆందోళన ఎదురవుతోంది.
సంఘ విద్రోహక శక్తుల పని!
కాసర్గోడ్ జిల్లా కుమ్బాడ్జేలోని ఓ చెట్టుకు ఉరి వేసి ఉన్న రెండు ముంగిసలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. మృతదేహాలున్న ప్రాంతంలో రాత్రి వేళ సంఘ విద్రోహక కార్యకలాపాలు సాగుతున్నట్టు వారు ఆరోపించారు. ఈ ఘటనను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
![mongoose](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5094483_rk.jpg)
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు.. మృతదేహాలను పరీక్షించారు. ఒక ముగింసను నాలుగు రోజుల మందు, మరో ముంగిసను రెండు రోజుల ముందే హత్య చేసినట్టు నిర్ధారించారు. అనంతరం వాటిని భూమిలో పూడ్చిపెట్టారు.
ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ మూగ జంతువుల మృతదేహాలను భూమి నుంచి తిరిగి బయటకు తీశారు అటవీశాఖ అధికారులు. అనంతరం శవపరీక్షకు పంపించారు. దీనికి సంబంధించిన నివేదిక రెండు రోజుల్లో వస్తుందని తెలిపారు.
మూగజీవులను చంపి.. ఉరివేసే ఘటనలు కేరళలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవలే తిరువనంతపురంలో ఓ పిల్లిని ఇదే విధంగా ఉరి వేశారు దుండగులు. ఇది మరువక ముందే ముంగిసను చంపిన ఘటన వెలుగు చూడటంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి : పిల్లిని చంపిన కిరాతకుడికి 34 నెలల జైలు