అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు ఈనెల 17లోపు తీర్పు వెలువరించనుంది. ఈ సందర్భంగా తీర్పు అనంతర పరిణామాలు, ఏ విధంగా స్పందించాలనే అంశంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యూహాలు రచిస్తోంది. ఆర్ఎస్ఎస్కు చెందిన ఉన్నత స్థాయి నాయకత్వం దేశవ్యాప్తంగా పర్యటించి.. ప్రజలు శాంతియుతంగా, సామరస్యంగా ఉండాలని ప్రచారం కల్పించేందుకు ప్రణాళికలు చేస్తోంది. ఉన్నత స్థాయి నాయకులు దేశవ్యాప్తంగా ఎవరెక్కడ పర్యటించాలనే దానిపైనా ఇప్పటికే చర్యలు చేపట్టింది సంఘ్.
" అయోధ్య తీర్పు ఆధారంగా ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్ లేదా భయ్యాజీ జోషీ మీడియా ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. తీర్పు ఏ విధంగా వచ్చినా దేశంలోని అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు సంఘ్ నేతలు. అల్లర్లు జరిగే ప్రాంతాలపైనా దృష్టి సారించారు. తీర్పు తమకు అనుకూలంగా వస్తే.. ఇంట్లోనో లేక సమీప ఆలయాల్లో మాత్రమే వేడుకలు జరుపుకోవాలని తన స్వయంసేవక్‌లకు ఇప్పటికే సూచించింది సంఘ్. అదే విధంగా తీర్పు వ్యతిరేకంగా వస్తే.. శాంతియుతంగా ఉండాలని పేర్కొంది."
-ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత
భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సహా సంఘ్, భాజపా ఉన్నతస్థాయి నాయకత్వం హాజరైన సమావేశంలో రామ జన్మభూమి తీర్పు అనంతర పరిణామాలపై చర్చించినట్లు సంఘ్ వర్గాలు తెలిపాయి.
సమన్వయ సమావేశం..
అయోధ్య భూవివాద కేసుపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో.. దిల్లీలోని న్యూ మహారాష్ట్ర సదన్‌లో ఆర్ఎస్ఎస్, భాజపా గురువారం సమన్వయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆర్ఎస్ఎస్ నాయకుడు క్రిష్ణ గోపాల్, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోష్, కేంద్ర మంత్రులు నరేందర్ సింగ్ తోమర్, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, గిరిరాజ్ సింగ్, సంతోష్ గంగ్వార్, పార్టీ నేతలు భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు.
ఇదీ చూడండి: 'అయోధ్య తీర్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి'