బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని పలుచోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో భాజపాకు భారీ విజయం అందించిన ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిందన్నారు. బుధవారం రాత్రి దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. కొవిడ్ సవాళ్లను అధిగమించి ప్రజలు ఓట్లు వేసి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారన్నారు. భాజపా ప్రజల హృదయాలను గెలుచుకుందని, ప్రజలకు సేవ చేయడం ఎలాగో తమ పార్టీకి తెలుసునన్నారు. దేశ నలుమూలలకూ భాజపా చేరిపోయిందన్న ప్రధాని.. దేశ వికాసం కోసం శ్రమిస్తున్నందునే జనం భాజపా వైపు నిలిచారని చెప్పారు. భారత ప్రజలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారని .. బిహార్‌లో గతంలో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగేవని గుర్తు చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సాధారణమైన విషయం కాదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనం భారీగా తరలివచ్చి ఓట్లు వేసి బిహార్‌లో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారని కృతజ్ఞతలు తెలిపారు.
భాజపాకు అతిపెద్ద సైలెంట్ ఓటర్లు వాళ్లే: మోదీ
ఇటీవల సైలెంట్ ఓటర్ల గురించి తరచూ వార్తల్లో వింటున్నామని.. మహిళా ఓటర్లు.. భాజపాకు అతిపెద్ద సైలెంట్ ఓటర్లుగా మారారని మోదీ అన్నారు. భారత మహిళల జీవన ప్రమాణాల మెరుగుకు భాజపా కృషిచేసిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. కరోనా వైరస్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిందని, ఇప్పటివరకు ఈ మహమ్మారిని ఎవరూ పూర్తిగా అంచనా వేయలేకపోయారని చెప్పారు. దేశ ప్రజల స్వప్నాల సాకారానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నట్టు చెప్పారు. అందుకే ప్రజలు పూర్తి విశ్వాసాన్ని భాజపా పట్ల ఉంచారన్నారు. సుపరిపాలన అందించడం వల్లే ప్రజల మద్దతు తమకు లభిస్తోందన్న ప్రధాని.. సబ్‌కా సాత్ - సబ్‌కా వికాస్ - సబ్‌కా విశ్వాస్ వల్లే ఎన్నికల్లో విజయం సాధించినట్టు చెప్పారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం నిలిచిన పార్టీ భాజపా అన్నారు.
ఆత్మనిర్భర్ భారత్‌కు జనం పట్టంకట్టారు: నడ్డా
అంతకముందు ఈ కార్యక్రమంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. భాజపాకు విజయం కట్టబెట్టిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్ తర్వాత జరిగిన అతి పెద్ద ఎన్నికలు ఇవేనని.. ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిందన్నారు. దేశ ప్రజలు ఒకేతాటిపైకి వచ్చి కమలానికి పట్టం కట్టారని తెలిపారు. లాక్‌డౌన్ తర్వాత 130 మంది కోట్ల ప్రజలకు ప్రధాని భరోసా కల్పించారన్నారు. దేశ అభివృద్ధి ప్రధాని మోదీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసించారన్నారు. కరోనా సమయంలో 150 దేశాలకు ఔషధాలు ఎగుమతి చేశామని తెలిపారు. ప్రధాని తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రజలు పట్టం కట్టారన్నారు. మోదీ సర్కార్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లిందో ఈ ఫలితాలు చూపాయని.. బిహార్‌లో గూండా రాజ్‌కు బదులు ప్రజలు వికాస్ రాజ్‌ను ఎన్నుకున్నారని ప్రశంసించారు.
ఇదీ చూడండి:బిహార్ తీర్పు 2020 హైలైట్స్