దేశంలో కరోనాపై పోరుకు ప్రజలే నాయకత్వం వహిస్తున్నారని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ యుద్ధంలో విజయం సాధించడానికి ఇదొక్కటే మార్గమని "మనసులో మాట" కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు మోదీ.
"కరోనాపై భారత్ చేస్తున్న యుద్ధానికి ప్రజలే నాయకులు. వారితో పాటు ప్రభుత్వాలు, యంత్రాంగాలు కలిసికట్టుగా పోరాడుతున్నాయి. వైరస్‌పై విజయం సాధించడానికి ఇదొక్కటే మార్గం. దేశప్రజలు వైరస్‌పై పోరులో సైనికుల్లా వ్యవహరిస్తున్నారు. యుద్ధాన్ని ముందుండి నాయకుడిలా నడిపిస్తున్నారు. అది మన అదృష్టం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
దేశం యుద్ధం మధ్యలో ఉందన్నారు ప్రధాని. ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఏ విషయంలోనూ అశ్రద్ధగా ఉండకూడదని స్పష్టం చేశారు. తాము ఉంటున్న ప్రాంతంలో ఇన్ని రోజులు వైరస్ లేదు కాబట్టి.. ముందుముందు కూడా రాదనుకుంటే ప్రజలు పొరబడినట్టేనని హెచ్చరించారు.
"దేనిమీదైనా అతినమ్మకం మంచిది కాదు. మీ నగరం, గ్రామం, కార్యాలయంలో వైరస్ లేకపోతే.. ఇక రాదని అనుకోకూడదు. ఇలాటి తప్పులు ఎప్పుడూ చేయకండి. ప్రపంచ దేశాలు ఇలాగే వ్యవహరించి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాయో మనం చూస్తూనే ఉన్నాం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
కొన్ని లాక్డౌన్ నిబంధనలను సడలించి, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆరోగ్య సిబ్బందిపై...
మనసులో మాట కార్యక్రమంలో అరోగ్య సిబ్బంది, పౌర సంఘాలపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని. వారి సంకల్పం వల్ల వాణిజ్యం, విద్యా వ్యవస్థలు, వైద్య విభాగాల్లో కొత్త మార్పులు వస్తున్నట్టు వెల్లడించారు.
పేదలను ఆదుకోవడంలో ప్రజల పాత్రను కొనియాడారు మోదీ. వారికి భోజనం, మందులు అందించడానికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేస్తున్నారని సంతృప్తి వ్యక్తంచేశారు.
covidwarriors.gov.inలో చేరాలని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. వలంటీర్లు, ఆరోగ్య నిపుణులు, పౌర సమాజం ప్రతినిధులు, స్థానిక యంత్రాంగంలోని సభ్యులు దీని ద్వారా మరింత సమర్థంగా సేవ చేయవచ్చన్నారు.
'చెడు అలవాట్లకు దూరంగా..'
ఇక నుంచి మాస్కులు ధరించడం ఒక అలవాటుగా మరిపోతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం వంటి చెడు అలవాట్లకు ప్రజలు స్వస్తి పలకాలని సూచించారు. ఇవి ప్రాథమిక పరిశుభ్రతా ప్రమాణాలను పెంచడమే కాకుండా.. వైరస్‌ను కట్టడి చేయడానికీ ఉపయోగపడతాయన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల పనితీరును ప్రధాని కొనియాడారు. ప్రజలు వారిని చూస్తున్న తీరులో మార్పు వచ్చిందన్నారు. రోడ్లపై ఉన్న వారికి సేవ చేస్తున పోలీసులను ప్రజలు అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. పోలీసుల్లోని సున్నిత భావాలను ప్రజలు గుర్తిస్తున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి:- 'కరోనా టెస్టుల్లో దూకుడేది? ఇలా అయితే కష్టమే'