వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్యపై విపక్షాలు చేస్తోన్న ఆరోపణలకు దీటుగా సమాధానమిచ్చారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పాక్ ప్రభుత్వం ముందుగా ట్విట్టర్ ద్వారా వైమానిక దాడి అంశాన్ని బయటపెట్టిందని తెలిపారు. 2008 ముంబై దాడుల అనంతరం అప్పటి ప్రభుత్వం మౌనంగా కూర్చుందని ప్రధాని ఆరోపించారు.అందుకే దేశ ప్రజలు వారిని పక్కనబెట్టారని ఎద్దేవా చేశారు.
పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత తాను అలాగే మౌనం వహిస్తే దేశ ప్రజలు తనను ఎందుకు ఎన్నుకుంటారని ప్రశ్నించారు.
"విపక్షాలు చెవులు తెరిచి వినండి. నా సాక్ష్యం 130 కోట్ల ప్రజల విశ్వాసం మాత్రమే. విపక్షాలకు దేశం గురించి ఏమాత్రం చింతలేదు. జైలుకు వెళ్లడం తప్పించుకోవడానికే..అధికారంలోకి రావాలనుకుంటున్నారు. మెరుపు దాడులు జరిగినప్పుడూ ఈ విధంగానే అనుమానాలు లేవనెత్తారు. సైన్యాన్ని అవమానించారు. ఇప్పుడు వైమానిక దాడి జరిగింది. ఈ ఘటన జరిగిన అనంతరం మేము ఏమీ ప్రకటించలేదు. అంత పెద్ద దాడి చేసినా దానిని మా ఖాతాలోకి వేసుకోవాలని ప్రయత్నించలేదు. ట్విట్టర్ ద్వారా పాకిస్థాన్ స్పందించింది. భారత బలగాలు దాడి చేసి మా వారిని చంపారని చెప్పడానికి పాకిస్థాన్‌కు జ్ఞానం లేదా..? మన వాళ్ల లాగ దాడి జరిగితే సాక్ష్యాలు అడగటానికి వారేమైనా మూర్ఖులా..?"-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి