ప్రస్తుతం దేశంలో ఎటుచూసినా 'నమో' జపమే వినపడుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన సందర్భంగా దేశవ్యాప్తంగా మోదీ నినాదాలు హోరెత్తుతున్నాయి. గుజరాత్లో మోదీపై అభిమానం మరింత పెరిగిపోయింది. అనేక విధాలుగా నరేంద్రుడిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు గుజరాత్‌వాసులు. తాజాగా సూరత్‌లోని ఓ ఐస్‌క్రీమ్ పార్లర్ యజమాని... కుల్ఫీలపై మోదీ ముఖాన్ని రూపొందించి విక్రయిస్తున్నాడు. సీతాఫలం రుచి ఉండే వీటికి 'మోదీ సీతాఫల్ కుల్ఫీ' అని పేరు పెట్టాడు. ఈ కుల్ఫీలకు విశేష ఆదరణ లభిస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు.
"మోదీ గెలిచిన సందర్భంగా మేము 'మోదీ సీతాఫల్ కుల్ఫీ'ని తయారు చేశాం. ప్రకృతిసిద్ధ పదార్థాలే వినియోగిస్తున్నాం. సీతాఫలం రుచి ఉంటుంది. ఒక్క కుల్ఫీ తయారీకి 24 గంటలు పడుతుంది. ఇందుకోసం ఎంతో శ్రమించాం. చివరకు మా శ్రమ ఫలించింది. కుల్ఫీకి మంచి ఆదరణ లభిస్తోంది."
- వివేక్ అజ్మేర, యజమాని.
కుల్ఫీ తయారీ కోసం ఎలాంటి యంత్రాలను ఉపయోగించలేదని.. చేతులతోనే తయారు చేస్తున్నామని తెలిపాడు వివేక్.
సరికొత్త కుల్ఫీలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కుల్ఫీ రుచి అదిరిపోయిందని తిన్నవారు అంటున్నారు.
ప్రమాణస్వీకారం వరకే..
ఒక్కో కుల్ఫీ ధర రూ 250. కానీ 50శాతం రాయితీతో కుల్ఫీలు అమ్ముతున్నాడు వివేక్. ఇప్పటికే 200 కుల్ఫీలు అమ్ముడుపోయాయి. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే వరకు 'మోదీ సీతాఫల్ కుల్ఫీ' అందుబాటులో ఉంటుందని యజమాని వివేక్ తెలిపాడు.
ఇదీ చూడండి: అప్పుడు నెహ్రూ, రాజీవ్... ఇప్పుడు మోదీ: రజనీ