భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మధ్య సరదా సంభాషణ జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. బిష్కెక్లో జరిగిన ఎస్సీవో సదస్సులో శుక్రవారం ఒకరినొకరు పలకరించుకుని ఛలోక్తులు కూడా విసురుకున్నట్లు సమాచారం.
ప్రధానిగా తిరిగి ఎన్నికైనందుకు మోదీకి ఇమ్రాన్ శుభాకాంక్షలు తెలిపారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు సిద్ధమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీ భారత్‌కు 2 వారాల క్రితమే లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశ ప్రధానుల మధ్య సంభాషణకు ప్రాధాన్యం సంతరించుకుంది.
2016 నుంచి చర్చల్లేవ్..
పఠాన్‌కోట్‌లో 2016లో భారత బలగాల శిబిరాలపై పాక్ దాడులు జరిపింది. అప్పటి నుంచి పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరపలేదు భారత ప్రభుత్వం. ఉగ్రవాద నిర్మూలనకు పాక్ చర్యలు చేపట్టేంత వరకు చర్చలు కుదరవని భారత్ తేల్చి చెప్పింది.
కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో రెండు రోజుల పాటు ఎస్సీవో సదస్సు జరిగింది. పాక్ ప్రధాని సహా సభ్య దేశాల అధినేతలు హాజరయ్యారు. అంతర్జాతీయ భద్రతా పరిస్థితులు, బహుపాక్షిక ఆర్థిక సహకారం, పలు కీలక అంశాల అంశాలపై చర్చ జరిగింది.
దిల్లీ బయల్దేరిన మోదీ..
సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనితో గురువారం సమావేశమయ్యారు మోదీ. కిర్గిస్థాన్ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్బెకొవ్తో నేడు భేటీ అయ్యారు.
శుక్రవారం సదస్సు ముగిశాక దిల్లీ బయలు దేరారు మోదీ.