ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నూతన వ్యవసాయ చట్టాలను ఉద్దేశించి మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్న రైతులను కేంద్రం దారుణంగా మోసం చేసిందని ట్వీట్ చేశారు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇటీవలే పంజాబ్, హరియాణాల్లో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు రాహుల్. ఇందుకు సంబంధించి రూపొందించిన ఓ వీడియోను తన ట్వీట్లో ట్యాగ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత. 'రైతులు దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్నారు. కానీ మోదీ ప్రభుత్వం వారికి ద్రోహం చేసింది. ఇకపై అలా జరగదు,' అని వ్యాఖ్యానించారు రాహుల్.
నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు నష్టపోతారని.. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేందుకు మోదీ ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే చట్టాలను కేంద్రం సమర్థించుకుంది. రైతుల ఆదాయాన్నిపెంచడానికి ఇవి తోడ్పడతాయని పేర్కొంది.
ఇదీ చూడండి: టీకా లభ్యత, పంపిణీ వ్యూహాలపై కేంద్ర మంత్రుల భేటీ