కరోనా కాలంలో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ విద్యుత్ బిల్లుల సెగ తాకింది. వాడకానికి మించి విద్యుత్ బిల్లులు రావడం సర్వసాధారణమైపోయింది. విద్యుత్ సంస్థలు, అధికారులు చేస్తున్న తప్పిదాలకు వినియోగదారులు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులకు ఇకపై చెక్ పడనుంది. అంతేకాదు విద్యుత్ సమస్యలూ సకాలంలో పరిష్కారం కానున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు ప్రత్యేకమైన హక్కులు కల్పించనుంది. ఇందుకోసం సరికొత్త ముసాయిదాను సిద్ధం చేస్తోంది.
విద్యుత్‌శాఖ ప్రకటన..
వినియోగదారుల హక్కుల కోసం తొలిసారి ముసాయిదాను తీసుకొస్తున్నట్లు.. బుధవారం ప్రకటించింది కేంద్ర విద్యుత్‌శాఖ.
" కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ చారిత్రక సంస్కరణకు సిద్ధమవుతోంది. వినియోగదారుడికి మద్దతుగా ఉండేలా ముసాయిదా తయారుచేస్తోంది. ఎలక్ట్రిసిటీ(రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్) రూల్స్-2020 పేరిట దాన్ని రూపొందిస్తున్నాం.
పౌరులందరికీ విద్యుత్ సదుపాయాన్ని కల్పించిన తర్వాత సేవల విషయంలో వినియోగదారుల సంతృప్తిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇందుకోసం కీలక సేవలను పరిగణనలోకి తీసుకోవడం, కనీస సేవా స్థాయిలు, ప్రమాణాల విషయంలో వినియోగదారులకు హక్కులు కల్పించనున్నాం. ప్రతి సబ్-డివిజన్‌కు ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులతో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరం ఏర్పాటు చేసి.. వినియోగదారులకు సేవలు అందించాలని ముసాయిదాలో ప్రతిపాదించాం."
-- కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ
కనెక్షన్ సులభతరం..
కనెక్షన్ తీసుకోవడాన్ని ఇకపై సులభతరం చేయనున్నారు. 10 కిలో వాట్లలోపు లోడ్‌తో ఏ వ్యక్తికైనా విద్యుత్ కనెక్షన్ కావాలంటే రెండు ధ్రువీకరణ పత్రాలు చాలు. 150 కిలోవాట్ల లోపు కనెక్షన్‌కు ఎటువంటి ఛార్జీలు ఉండవు. మెట్రో నగరాల్లో 7 రోజులు దాటకుండా, పట్టణాల్లో 15 రోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల్లోనే.. కొత్త కనెక్షన్లు ఇవ్వాలని, మార్పు చేయాలని ముసాయిదాలో ప్రతిపాదించారు.
లెక్కలు తేలుతాయ్..
విద్యుత్ సరఫరా సంస్థలు వినియోగదారులకు అందించిన ప్రతి యూనిట్ కరెంటునూ లెక్కగట్టి వారి నుంచి డబ్బు వసూలు చేయడం కష్టతరమవుతోంది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని 'పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్' నివేదిక ప్రకారం, సరఫరా చేసిన విద్యుత్తులో 83 శాతానికి మాత్రమే లెక్క తేలుతోంది. మిగిలిన 17 శాతానికి లెక్క తెలియకపోవడం వల్ల సంబంధిత సంస్థలు.. ఏటా ఒక లక్ష 15వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నాయి. ఈ ముసాయిదాతో దీనికి చెక్ పడనుంది. ఏడాదిలో వినియోగదారుల సగటు విద్యుత్ వాడకం, డిస్కంల నుంచి విద్యుత్ సరఫరాను రాష్ట్ర విద్యుత్ సంఘాలే అంచనా వేసి లెక్కలు తేల్చనున్నాయి.
సులభతర సేవలు..
విద్యుత్ బిల్లుల చెల్లింపులను క్యాష్, చెక్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాకింగ్ రూపంలో చెల్లించే సౌలభ్యాన్ని కల్పించనున్నారు. 7 రోజులు, 24 గంటల పాటు ఉండే కాల్ సెంటర్, వెబ్సైట్, మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ముసాయిదాలో ప్రతిపాదించారు. వీటిల్లో కొత్త కనెక్షన్ కోసం అర్జీ, కనెక్షన్ రద్దు, రీకనెక్షన్, కనెక్షన్ తరలింపు, పేరు వివరాల మార్పు, మీటర్ మార్పు, లోడ్ మార్పు, నో సప్లయ్ వంటి సేవలను అందుబాటులో ఉంచనున్నారు. మొబైళ్లకు, ఈ-మెయిల్‌కు సంక్షిప్త సందేశాలు, ఆన్లైన్ స్టేటస్ ట్రాకింగ్, ఆటో ఎస్కలేషన్ వంటి ఫీచర్లు ఉంటాయి.
ముసాయిదా కోసం ప్రజలు, సంస్థలు సెప్టెంబర్ 30 వరకు తమ సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. వాటిని పరిగణించి అవసరమైన మార్పులు, చేర్పులు చేపడతామని విద్యుత్‌శాఖ స్పష్టం చేసింది.