పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా బంగాల్లోని సిలీగుఢీలో ప్రచార సభకు హాజరయ్యారు. పేదలకు మెరుగైన వైద్యం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని బంగాల్లో మమత ప్రభుత్వం అమలు చేయట్లేదని ఆరోపించారు. మమతా బెనర్జీ అధికారంలో ఉన్నంత వరకూ బంగాల్ అభివృద్ధికి నోచుకోదని వ్యాఖ్యానించారు మోదీ.
" దేశవ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా.. బంగాల్లో మాత్రం అభివృద్ధి జరగడం లేదు.. దానికి కారణం ఎవరో తెలుసా? పశ్చిమ బంగలో ఉన్న ఒక స్పీడ్ బ్రేకరే... ఆ స్పీడ్ బ్రేకర్ ఇక్కడి ప్రజలకు 'దీదీ' పేరుతో పరిచయం. మీ అభివృద్ధిని దీదీ అడ్డుకుంటున్నారు. ఆమెకు పేదలపై ధ్యాస లేదు. పేదలపై రాజకీయాలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక పేదరిక నిర్మూలనకు ఎలా కృషి చేస్తారు. పేదలు లేకపోతే దీదీకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. కాంగ్రెస్, వామపక్షాలదీ ఇదే తీరు. వాళ్లకు పేదలు కావాలి, పేదలను ఎప్పటికీ పేదలుగా ఉంచితేనే వారికి రాజకీయ మనుగడ."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
పాక్ కోసం మమత కన్నీరు
బాలాకోట్‌లో భారత వాయుసేన నిర్వహించిన మెరుపు దాడుల అనంతరం దేశ ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తే... దీదీ మాత్రం కన్నీరు కార్చారని ఆరోపించారు మోదీ. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ కూటమి పార్టీలన్నీ పాకిస్థాన్ పట్ల సానుభూతి కనబరుస్తున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏఎఫ్ఎస్పీ చట్టాన్ని సమీక్షిస్తామని పేర్కొనడంపై తీవ్రంగా మండిపడ్డారు మోదీ. భద్రతా దళాలకు రక్షణ కవచంలా ఉన్న చట్టానికి మార్పులు చేసి వారిని నిస్సహాయులను చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని విమర్శించారు.
ఇదీ చూడండి:'వారి జేబుల నుంచే న్యాయ్ నిధుల సేకరణ'