సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఘనవిజయం సాధించిన ఉత్సాహంతో మోదీ సర్కార్ పార్లమెంటులో శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టింది. నవభారత నిర్మాణమే ధ్యేయంగా.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 27 లక్షల 86 వేల 349 కోట్ల అంచనాతో వార్షిక పద్దు సమర్పించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
కోట్లాది ప్రజల అంచనాలు, ఆకాంక్షల నడుమ బడ్జెట్ తీసుకొచ్చిన ప్రభుత్వం.. దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తామని పేర్కొంది. వ్యవస్థీకృత సంస్కరణలే ఎజెండాగా పద్దును తీసుకొచ్చింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే ఆశయంతో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేసింది కేంద్రం.
సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన కోసం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించింది. రూ. 5 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్నులో ఎలాంటి మార్పులు చేయని కేంద్రం... దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా భావించే మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రోత్సహించే విధంగా కార్యచరణ ప్రకటించింది.
సామాన్యులకు భారీ వరాలు ప్రకటించకపోయినా... జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రధానాంశంగా కీలక కార్యక్రమాలు ప్రకటించింది.
పెట్రోల్, డీజిల్‌పై సుంకం పెంపు...
ఇంధన ధరలు సామాన్యులకు మరింత భారమయ్యాయి. తక్షణ భారం మోపి సామాన్యులు, మధ్యతరగతి ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది కేంద్రం. పెట్రోల్, డీజిల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 1 చొప్పున పెంచారు. వాటిపై రోడ్డు మౌలిక వసతుల సెస్సునూ లీటరుకు రూ.1 చొప్పున పెంచుతున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి.
ఈ సెస్సుతో సామాన్యులు ఇబ్బంది పడనున్నారు. ప్రయాణ ఛార్జీల నుంచి నిత్యావసర వస్తువుల పైనా ఇది ప్రభావాన్ని చూపనుంది.
ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా ఉంచారు. బంగారంపై కస్టమ్స్ సుంకం 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచి అసంతృప్తికి గురిచేశారు. గృహ రుణాలకు మాత్రం స్వల్ప వెసులుబాటు కల్పించారు.
సంపన్నులపై పన్ను...
ధనిక వర్గాలపై పన్ను మోత మోగించింది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ వార్షికాదాయం సంపాదించే వారు గరిష్ఠంగా 42 శాతం పన్ను కట్టాల్సుంటుంది. దాదాపు 75 వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచారు.
మొత్తంగా బడ్జెట్.. ధనిక వర్గాలపై భారం, మధ్య తరగతివారితో ఇచ్చిపుచ్చుకునే ధోరణి, ప్రజాకర్షక పథకాలకు కోత విధించడం అన్న ధోరణిలో సాగింది.
ఆధార్‌తోనూ ఐటీ..
ఆదాయపు పన్ను(ఐటీ) రిటర్నులు దాఖలు చేసేందుకు పాన్ అవసరమన్న నిబంధనను తాజా బడ్జెట్లో తొలగించారు. పాన్‌తో పాటు ఆధార్ సంఖ్య ఆధారంగానూ రిటర్నులు దాఖలు చేయొచ్చు.
విద్యుత్ రంగానికి...
ఒకే దేశం, ఒకే గ్రిడ్ లక్ష్యాన్ని సాధించేందుకు విద్యుత్ రంగానికి ప్రభుత్వం త్వరలో ప్యాకేజీని ప్రకటించనుంది. ఉజ్వల, సౌభాగ్య పథకాల కింద 2022 నాటికి గ్రామాల్లో కోరుకున్న ప్రతి ఇంటికీ వంటగ్యాస్, విద్యుత్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.
వ్యవసాయానికి పెద్ద పీట..
2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న నరేంద్ర మోదీ తొలి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం దిశగా నిర్మలా సీతారామన్ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు జరిపారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు, రైతుల సంక్షేమానికి అగ్ర తాంబూలం వేశారు. ఈ రంగానికి రూ. 1.39 లక్షల కోట్లను ప్రతిపాదించారు విత్త మంత్రి. కిసాన్ సమ్మాన్ నిధికి రూ .75 వేల కోట్లు కేటాయించారు.
రైల్వేలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం
2018 నుంచి 2030 మధ్య రైల్వేల్లో మౌలిక వసతుల కల్పనకు 50 లక్షల కోట్ల రూపాయలు అవసరమని నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.
అందుకోసం ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
రహదారుల నిర్మాణం..
పర్యావరణ హిత పదార్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా 30 వేల కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించినట్లు తెలిపారు నిర్మలా సీతారామన్. ఇదే పథకం మూడోదశ కింద 80 వేల 250 కోట్ల రూపాయల వ్యయంతో లక్షా 25 వేల కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి పరుస్తామన్నారు.
ఆదాయ పన్నులు యథాతథం
మోదీ 2.0 ప్రభుత్వం తొలి బడ్జెట్లో పన్ను మినహాయింపు కల్పిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూసిన సగటు భారతీయుడికి నిరాశే మిగిలింది. ఆదాయ పన్నులు యథాతథమని ప్రకటించారు నిర్మలా సీతారామన్ రూ. 5 లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను ఉండదన్నారు.
ప్రభుత్వ బ్యాంకులకు మూలధన సాయం..
బ్యాంకింగ్ రంగం ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతానికి, వాటి రుణ సామర్థ్యాన్ని పెంచేందుకు 70 వేల కోట్ల రూపాయలను మూలధన సాయంగా అందజేయనున్నట్లు తెలిపారు.
కీలకాంశాలివే...
- ఆదాయపు పన్ను శ్లాబులు యథాతథం
- సంపన్నులపై మోత
- ఏడాదికి రూ. కోటి దాటిన నగదు ఉపసంహరణలపై 2 శాతం పన్ను.
- రూ. 400 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన కంపెనీలకు పన్ను 25 శాతమే
- వడ్డీపై పన్ను మినహాయింపుతో గృహనిర్మాణానికి ఊతం
- ఆధార్‌తోనూ ఐటీ రిటర్న్ దాఖలు
- ఆహారం, ఇంధనం, ఎరువుల రాయితీకి రూ. 3.01 లక్షల కోట్లు
- ఆయుష్మాన్ భారత్‌కు రూ. 6,400 కోట్లు
- స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు రూ. 29 వేల కోట్లు
- 2024 నాటికి ఇంటింటికీ నల్లా నీరు