కరోనా వైరస్ భారత్‌లోని పలు నగరాల్లో వ్యాపిస్తోంది. తాజాగా గురుగ్రామ్‌లోని ఓ పేటీఎం ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. ఫలితంగా దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 29కి చేరింది. ఇటీవలే ఇటలీ విహారయాత్రకు వెళ్లొచ్చిన తమ సంస్థ ఉద్యోగికి కరోనా సోకినందున పేటీఎం అప్రమత్తమైంది. తమ ఉద్యోగులను కొద్ది రోజుల పాటు ఇంటి వద్ద నుంచే పనిచేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే దీని వల్ల తమ సంస్థ రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది కలగదని సంస్థ స్పష్టం చేసింది.
పరీక్షలకు మాస్కులు
కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో 10, 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు... మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు ఉపయోగించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అనుమతిచ్చింది.
రైల్వేలో ప్రత్యేక వార్డులు తప్పనిసరి
కరోనా నివారణకు భారత రైల్వే చర్యలు చేపట్టింది. రైల్వే ఆధ్వర్యంలోనే ప్రతి డివిజనల్, సబ్ డివిజనల్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ముఖ్య వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
కరోనా సోకలేదు!
ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో... జనవరి 15 నుంచి విదేశాలకు వెళ్లివచ్చిన 370 మందిని వైద్యాధికారులు ప్రత్యేకంగా (నిఘా) పర్యవేక్షిస్తున్నారు. అయితే వీరెవరికీ కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ కాలేదని తెలిపారు.
మరోవైపు చైనా వుహాన్ పట్టణం నుంచి మహారాష్ట్రకు వచ్చిన 167 మందిలో 161 మందికి వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించారు. అయితే వీరిలో ఎవరికీ ఈ వైరస్ సోకినట్లు నిర్ధరణ కాలేదని తెలిపారు.
మధ్యప్రదేశ్ వైద్యాధికారులు... తొమ్మిది మంది ఇటాలియన్ పర్యటకులకు, వారితో ఉన్న ఓ భారతీయ గైడ్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇద్దరు జలుబు, దగ్గుతో బాధపడుతున్నారని, వారిని వైద్యులు పర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
పాఠశాల విద్యార్థులు జాగ్రత్త

విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పాఠశాల యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనాపై విద్యార్థుల్లో అవగాహన పెంచాలని మార్గనిర్దేశాలు అందించింది.
వైద్య తనిఖీలు తప్పనిసరి
కరోనా భారత్‌లో వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అటారీ, కర్తార్‌పుర్, అగర్తలాతో సహా విదేశాల నుంచి భారత్ వచ్చే అన్ని (ల్యాండ్ పోర్టు) మార్గాల్లోనూ ప్రయాణికులకు స్కానింగ్‌తో సహా పూర్తి వైద్యపరీక్షలు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి: మోదీ ఐదేళ్ల విదేశీ పర్యటనల ఖర్చు రూ.446 కోట్లు