లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో చైనా అతిక్రమణలకు పాల్పడినట్లు అంగీకరిస్తూ ఒక అధికారిక పత్రం రక్షణ శాఖ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది. దీనిపై వార్తలు రావడంతో రక్షణ శాఖకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఆ పత్రాన్ని వెంటనే వెబ్‌సైట్ నుంచి తొలగించింది. ఈ అంశంపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది.
రక్షణ శాఖ ఈ పత్రాన్ని మంగళవారం తన వెబ్‌సైట్‌లో ఉంచింది. 'జూన్ 2020లో రక్షణ శాఖ చేపట్టిన కార్యక్రమాలు' పేరిట రూపొందించిన ఈ పత్రంలో భారత్, చైనా సైన్యాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని ప్రస్తావించింది.
ఈ పత్రంలో ఏముందంటే..
"వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురుసుతనం పెరిగింది. ముఖ్యంగా మే 5 నుంచి గల్వాన్ లోయలో ఇది ఎక్కువగా కనిపించింది. చైనా బలగాలు మే నెల 17, 18 తేదీల్లో కుంగ్రాంగ్ నాలా, పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరం, గోగ్రా వద్ద అతిక్రమణలకు పాల్పడ్డాయి" అని పేర్కొంది.
ఉద్రిక్తతలు చల్లార్చేందుకు రెండు దేశాల సైనికాధికారుల మధ్య క్షేత్రస్థాయిలో చర్చలు జరిగాయని కూడా తెలిపింది. జూన్ 6న కోర్ కమాండర్ స్థాయి భేటీ జరిగిందని వివరించింది. అయితే జూన్ 15న జరిగిన హింసాత్మక ఘర్షణ వల్ల రెండు వైపులా మరణాలు సంభవించాయని తెలిపింది.
"పరస్పరం ఆమోదయోగ్య స్థాయిలో ఏకాభిప్రాయానికి రావడానికి సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సైనిక ప్రతిష్టంభన దీర్ఘకాలం కొనసాగేలా ఉంది" అని వివరించింది.
ఇదే మొదటిసారి..
మే నెలలో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాక 'చైనా దూకుడు' అనే పదాన్ని ప్రభుత్వం ప్రయోగించడం ఇదే మొదటిసారి. వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి చైనా సైన్యం ప్రవేశించలేదన్నది ప్రభుత్వ అధికారిక విధానం. జూన్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ ఇదే రకమైన ప్రకటన చేశారు.
"ఎవరూ మన భూభాగంలోకి చొరబడలేదు. మన సైనిక శిబిరాన్ని చేజిక్కించుకోలేదు’’ అని చెప్పారు. ఈ నేపథ్యంలో తన వెబ్‌సైట్‌లో వచ్చిన ప్రకటనపై గురువారం కథనాలు రావడం వల్ల రక్షణశాఖ స్పందించింది. సదరు పత్రాన్ని వెబ్‌సైట్ నుంచి తొలగించింది.
వాస్తవాలు చెరిగిపోవు: కాంగ్రెస్
రక్షణ శాఖ తన పత్రాన్ని వెబ్‌సైట్ నుంచి వెనక్కి తీసుకున్నంత మాత్రాన వాస్తవాలు మారబోవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
"భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని చెప్పడం ద్వారా ప్రధాని అబద్ధాలాడారు. తూర్పు లద్దాఖ్‌లో పోరాడుతూ ప్రాణాలర్పించిన బిహార్ రెజిమెంట్ సైనికులను అవమానించారు" అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'చైనా పేరు చెప్పేందుకు కూడా ప్రధానికి ధైర్యం లేదు'