మన్సుఖ్లాల్ మాండవ్యా... గత ప్రభుత్వంలో రవాణాశాఖ సహాయమంత్రి. ఇప్పుడు రసాయనాలు, ఎరువుల శాఖకు స్వతంత్ర హోదా సహాయ మంత్రి. కేంద్ర మంత్రిగా, గుజరాత్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్నా, పాలితానా అసెంబ్లీ శాసనసభ్యుడి హోదాలో ఉన్నా ఆయన రూటే సెపరేటు. కార్యాలయం ఎంత దూరమైనా సరే. సర్రున ఒక సైకిల్ పై దూసుకెళ్లాల్సిందే. 7 ఏళ్లుగా ఇదే తంతు.
వ్యవసాయ కుటుంబం నుంచి...
మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు మాండవ్యా. దంతెవాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి పశువైద్య శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ చదివారు. విద్యార్థి దశలో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నేతగా రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యారు.
28 ఏళ్లకే ఎంఎల్ఏ
2002 సంవత్సరంలో 28 ఏళ్లకే పాలితానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎంపికయ్యారు.
పాదయాత్రతో వెలుగులోకి
2005లో 123 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. బాలికా విద్యపై అవగాహన దిశగా 45 వెనకబడిన గ్రామాల గుండా ఈ పాదయాత్ర సాగింది. 2007లో 52 గ్రామాల్లో 127 కిలో మీటర్ల మరో పాదయాత్ర చేపట్టారు. దీనిలో బాలికా విద్యపై మరింత ప్రోత్సాహమందించాలని బేఠీ పడావో.. బేఠీ బచావో నినాదమిచ్చారు. బాల్యవివాహాలపై అవగాహన, చెడు వ్యసనాలకు దూరంగా ఉండటంపై ప్రజలను చైతన్యపరిచారు.
మోదీకి సన్నిహితుడు
మోదీకి అత్యంత సన్నిహితుడైన నేతల్లో మాండవ్యా ఒకరు. 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం నాడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ రాజ్యసభకు పంపారు. తనకంటే ముందుగా మాండవ్యాను దిల్లీకి పంపారని రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
సమస్యలపై ఉక్కుపాదం
2013లో భాజపా గుజరాత్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2014లో గుజరాత్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీకి, నేతలకు మధ్య సయోధ్య కుదర్చడంలో సిద్ధహస్తులు. భాజపా గుజరాత్ విభాగంలో సమస్యలు ఉత్పన్నమయితే ముందుగా గుర్తొచ్చే పేరు మాండవ్యా. వృద్ధులతో, పెద్దవారితో మమేకమై మోదీ పథకాలపై అవగాహన కల్పిస్తుంటారు.
ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగం- ప్రశంసలు
ఐక్యరాజ్యసమితి సాధారణసభలో భారత్ తరఫున ప్రసంగించారు మాండవ్యా. వివిధ దేశాధినేతల ప్రశంసలందుకొన్నారు.
ఇదీ చూడండి: అమిత్‌షాకు హోం... రాజ్‌నాథ్‌కు రక్షణ శాఖ