చైనా దాష్టీకంతో ఉద్రిక్తతలు తలెత్తిన లద్దాఖ్‌లోని సరిహద్దుల వద్ద భద్రతను మరింత పటిష్టం చేసింది భారత్. ఇప్పటికే అదనపు బలగాలను తరలించగా.. తాజాగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను కూడా మోహరించింది. లేహ్ వద్ద ఇవి గాల్లో చక్కర్లు కొట్టాయి. గస్తీని ముమ్మరం చేశాయి.
వైమానిక దళ ప్రధానాధికారి ఆర్కేఎస్ బధౌరియా కూడా జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్, లద్దాఖ్‌లోని లేహ్ వైమానిక స్థావరాలను సందర్శించారు.
ఈ నెల 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 35 మంది చైనా సైనికులు హతమై ఉంటారని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. చైనా మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలున్నా.. గల్వాన్ నదీ ప్రవాహం భారత్ వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు చైనా బుల్డోజర్లతో పనులు నిర్వహిస్తోందని తెలిసింది. ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు చర్చలు కొనసాగుతున్నాయని భారత్, చైనా ప్రకటించినా రెండు దేశాల మధ్య పరిస్ధితి నివురు గప్పిన నిప్పులా ఉంది.