స్వాతంత్ర్యం వచ్చి 70ఏళ్లు గడిచినా దేశంలోని అనేక ప్రాంతాలు ఇంకా దుర్భర స్థితిలోనే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి. చుక్క నీటి కోసం అనేక గ్రామాల ప్రజలు కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. ఇన్ని కష్టాలుండటం వల్ల.. ఇక్కడి యువకులకు పెళ్లిళ్లు జరగడం లేదు.
పాదయాత్రలు...
బుందేల్‌ఖండ్‌కు చెందిన చిత్రకూట్ జిల్లాలో అనేక గ్రామాలు చుక్క మంచి నీటి కోసం విలవిల్లాడిపోతున్నాయి. నీటి కోసం కిలోమీటర్లు మేర పాదయాత్ర చేయాల్సి వస్తోంది. గుక్కెడు మంచి నీరు దొరికితే అదే పదివేలుగా భావిస్తున్నారు అక్కడి ప్రజలు.
జమనేహి, గోపిపుర్ గ్రామాలపై మూడు దశాబ్దాలుగా వరుణుడు చిన్న చూపు చూస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా వీరు కరవులోనే జీవిస్తున్నారు. తెల్లవారు జామునే.. ఈ గ్రామాల్లోని చిన్నా,పెద్దా.. అందరూ బిందెలు చేత పట్టుకుని నీటి వేట కోసం బయలుదేరుతారు. ఇది తప్పా వీరు ఇంకే పని చెయ్యరు. దీన్ని బట్టి ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైలు పట్టాలపై ప్రమాదకరంగా నడుస్తూ.. నీటి కోసం చిన్నపిల్లలు అన్వేషిస్తుంటారు.
కరోనా భయాలున్నా...
ఈ గ్రామాల్లో ఆదివాసీలే ఎక్కువ. తాగు నీటి సమస్యతో పాటు కరోనా వైరస్ ప్రభావం వీరిపై అధికంగా పడింది. ప్రజల్లో అనేక భయాలు నెలకొన్నాయి. అయితే ఐదేళ్లుగా వీరు పడుతున్న కష్టాలను చూసిన జిల్లా యంత్రాంగం.. ఈ గ్రామాలకు వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటికీ 60 లీటర్ల చొప్పున అందిస్తోంది. ఇందుకోసం ప్రజలు గుంపులుగుంపులుగా ట్యాంకర్ల వద్ద గుమిగూడుతున్నారు. భౌతిక దూరాన్ని పట్టించుకోవడం లేదు.
ఈ గ్రామాలకు వెళ్లాలంటే పెద్ద సాహసమే చేయాలి. ఇక్కడ రోడ్లు ఎంతో ప్రమాదకరంగా ఉంటాయి. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా.. ఈ గ్రామాల్లో ఇంకా ఎడ్లబండ్లే వారికి ప్రయాణ వాహనాలు.
పెద్ద సమస్య అదే...
ఇంతటి దయనీయ పరిస్థితుల్లో జీవిస్తుండటం వల్ల.. ఈ గ్రామంలోని యువకులను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు. వయసు మీద పడుతున్నా జీవిత భాగస్వామి దొరకటం లేదు. నీరులేని గ్రామాలకు తమ పిల్లలను ఎలా ఇవ్వగలమని వచ్చినవారు కూడా వెనుదిరుగుతున్నారు.
ఇక్కడి నుంచి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన ఆడబిడ్డలు.. తమ గ్రామంలోని పరిస్థితులు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు.
ఈ పూర్తి వ్యవహారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. నివేదిక రాగానే గ్రామాలకు నీటి సదుపాయాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.