భారతీయ వైద్య మండలి(ఐఎంఏ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ)ని తీసుకురావడాన్ని నిరసిస్తూ 5వేల మంది డాక్టర్లు, వైద్య విద్యార్థులు నిరసన తెలిపారు. వైద్యవిద్యలో సంస్కరణల కోసం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి ర్యాలీగా వెళ్లి నిర్మాణ్ భవన్‌ను ముట్టడించారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం భారతీయ వైద్య మండలి (ఐఎంఏ)లో 3 లక్షల మంది వైద్యులు, విద్యార్థులు సభ్యులుగా ఉన్నారు. ఐఎంఏ విధానాలు పేదలు, విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ చర్యను వైద్యులు వ్యతిరేకిస్తున్నారు.
"వైద్య విద్య చరిత్రలో ఎన్ఎంసీ బిల్లు పనికిరానిది. ఆరోగ్య శాఖ మంత్రి ఒక డాక్టర్ అయి వైద్య విద్యను నాశనం చేసేందుకు మొండిగా బిల్లు ఆమోదానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మేం ఎంతమాత్రం అంగీకరించబోం. ప్రజలకు, విద్యార్థులకు వ్యతిరేకమైన, అప్రజాస్వామికమైన బిల్లు ఇది. దీనికి వ్యతిరేకంగా వైద్య విద్యార్థులూ కలిసి వస్తున్నారు."
-డా. సంతాను సేన్, ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు
నూతన బిల్లులో పొందుపరచిన ప్రైవేటు వైద్య కళాశాలల్లోని 50 శాతం సీట్లకు రెగ్యులేషన్ ఫీజును సైతం ఐఎంఏ వ్యతిరేకిస్తోంది. ప్రైవేటు కళాశాలల్లోని 50 శాతం సీట్లకు మాత్రమే ప్రభుత్వ నిబంధనలను వర్తింపజేయడం ద్వారా నియమాలను నీరు గారుస్తున్నారని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు హర్జీత్ భట్టి ఆరోపించారు.
ఇదీ చూడండి: అక్రమ డిపాజిట్ పథకాల రద్దు బిల్లుకు ఆమోదం