స్వాతంత్య్రం పొందిన ఏడు దశాబ్దాల తరవాతా- ఆరోగ్య వ్యవస్థ వేరూనుకోని పల్లెపట్టుల్లో ప్రాథమిక వైద్యసేవలు సైతం నీరోడుతున్న దేశం మనది. స్వస్థ సేవల అందుబాటు, వాటి నాణ్యతల రీత్యా 195 దేశాల జాబితాలో భారత్ ఇప్పటికీ 145వ స్థానాన ఈసురోమంటోంది. అసంఖ్యాక పౌరులకు సర్కారీ వైద్యం అందని మానిపండైన తరుణంలో, గ్రామీణ ప్రాంతాలకు ఉపశమనం కలిగించే తీపికబురు అందించింది సర్వోన్నత న్యాయస్థానం.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో స్నాతకోత్తర పట్టభద్ర(పీజీ), స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశం కోరే విద్యార్థులు విధిగా బాండునొకదాన్ని సమర్పించాలని రాష్ట్రాలు షరతు విధిస్తుండటం తెలిసిందే. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు గుజరాత్, గోవా, హిమాచల్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ్‌బంగ, రాజస్థాన్, తమిళనాడు ఎంబీబీఎస్ తరవాత చదువు కొనసాగించదలచిన ప్రతి వైద్య విద్యార్థీ గ్రామాల్లో కొన్నాళ్లు విధిగా సేవలందించాల్సిందేనంటున్నాయి.
షరత్తులు ఏంటంటే
ఆ మేరకు లిఖితపూర్వకంగా సమ్మతి తెలిపి నియమోల్లంఘనకు పాల్పడితే రూ.50లక్షల వరకు జరిమానా చెల్లించాల్సిందేనంటున్నాయి. జరిమానా మొత్తాన్ని రూ.20లక్షలకు పరిమితం చేయాలన్న సుప్రీంకోర్టు, గ్రామసేవ వ్యవధిని దేశవ్యాప్తంగా రెండేళ్లుగా స్థిరీకరించాలని తాజాగా గిరిగీసింది.
అందుకు అనుగుణంగా జాతీయస్థాయి విధాన రూపకల్పన బాధ్యతను కేంద్రప్రభుత్వానికి, కొత్తగా అవతరించనున్న ఎన్‌ఎమ్‌సీ (జాతీయ వైద్య కమిషన్)కి దఖలుపరచింది. రాష్ట్రాలు విధించిన షరతు దేశ పౌరులందరికీ జీవించే హక్కు ప్రసాదించిన ఇరవై ఒకటో రాజ్యాంగ అధికరణ స్ఫూర్తికి పట్టం కట్టిందని న్యాయమూర్తులు ప్రత్యేకంగా ప్రస్తుతించడం విశేషం. రాష్ట్రానికో తీరుగా కొలువుతీర్చిన నిబంధనల ఏకరూపతకు ఉద్దేశించిన ప్రక్షాళన కసరత్తు దరిమిలా దేశమంతటా పల్లెలకు వైద్యసేవలు ఇనుమడిస్తే, ఎన్నో కోట్లమందికి నిజంగానే అది మహాభాగ్యం!
ఎండమావులై ఆలమటిస్తున్న వైద్యసేవలు
కేంద్రీయ స్వాస్థ్య నిఘా సంస్థ (సీబీహెచ్‌ఐ) నాలుగేళ్ల క్రితం రూపుదిద్దిన ‘జాతీయ ఆరోగ్య చిత్రణ’- దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 4.92 లక్షలు, ఊళ్లలో 1.83 లక్షల మేర ఆస్పత్రి పడకలు ఉన్నట్లు నిర్ధారించింది. జనాభాలో 68 శాతానికి పైగా ప్రాతినిధ్యం కలిగిన పల్లెపట్టులు నేటికీ సరైన వైద్యసేవలు ఎండమావులై అలమటిస్తున్నాయనడానికి ఆ అధ్యయనమే సాక్ష్యం పలుకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో 19 శాతం లోపు అలోపతీ వైద్యులే వృత్తిపరమైన ప్రామాణిక నైపుణ్యాలు కలిగినవారన్న నివేదికాంశాలు నిరుడు గగ్గోలు పుట్టించాయి. దేశం నలుమూలలా 20 శాతానికి పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తరుగుపడ్డట్లు ఆమధ్య ప్రభుత్వమే లోక్‌సభాముఖంగా అంగీకరించింది. ఎకాయెకి 20 లక్షలమంది వైద్యులకు, 40 లక్షలమంది నర్సులకు కొరత జనభారతాన్ని కుంగదీస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
తమ జీవితకాలంలో ఏనాడూ స్పెషలిస్ట్ డాక్టర్ని చూడని భారతీయుల సంఖ్య సుమారు 70 కోట్లుగా లెక్కతేలింది. వెరసి, గ్రామీణ వైద్యం గాలిలో దీపమైంది! ఒక్కో ఎంబీబీఎస్ విద్యార్థిపైనా ఏటా రూ.31 లక్షలకు పైగా వ్యయం చేస్తున్నట్లు లోగడ అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ అధ్యయనం మదింపు వేసింది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న ‘సుప్రీం’ న్యాయమూర్తులు- ప్రభుత్వపరంగా ప్రతి వైద్యవిద్యార్థి మీదా భారీ ఖర్చు దృష్ట్యా గ్రామాల్లో వారి సేవలు పొందగోరడమన్నది చట్టవ్యతిరేకం, నిర్హేతుకం కానేకాదని కరాఖండీగా తీర్మానించారు. పల్లెలకు స్పెషలిస్ట్ వైద్యసేవలు ఒనగూడాల్సిందేనన్న ఈ విశిష్ట తీర్పు సత్వరం అక్షరాలా అమలుకు నోచుకునేలా విధివిధానాల కూర్పు, కార్యాచరణ చురుకందుకోవాలిప్పుడు!
వైద్య పదవీ విరమణ పెంచిన అందని ఫలితం
దేశంలో వైద్యుల కొరతను అధిగమించేందుకంటూ వారి పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతూ ప్రధాని మోదీ, ‘ఆరోగ్య సేవలు అందకుండా పేదలు అవస్థలపాలు కారాదు’ అని మూడు సంవత్సరాల క్రితం యంత్రాంగానికి పథనిర్దేశం చేశారు. అప్పట్లోనే పార్లమెంటరీ స్థాయీసంఘం ధ్రువీకరణ ప్రకారం- దేశంలో సరైన వైద్యసేవలందక ఏటా కడతేరిపోతున్న అభాగ్యుల సంఖ్య దాదాపు 24 లక్షలు. సకాలంలో చికిత్స చేస్తే ప్రాణాంతకం కాని 32 రకాల వ్యాధులు, గాయాల పాలబడి నేలరాలిపోతున్న దీనుల సంఖ్య ప్రాతిపదికన దేశీయ వైద్య రంగ ప్రతిష్ఠ తెగ్గోసుకుపోతూనే ఉంది. 70 శాతం ఆస్పత్రులు పట్టణాల్లోనే ఉన్న కారణంగా, సర్కారీ వైద్యం అక్కరకు రాని చుట్టమైన పల్లెవాసులు- కుటుంబంలో ఎవరు అనారోగ్యం పాలబడినా నిస్సహాయంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అలా ఏటా ఆర్థికంగా చితికిపోతున్నవారి సంఖ్య ఆరు కోట్లకు పైబడినట్లు పార్లమెంటరీ స్థాయీసంఘమే గణించింది.
మౌలికసదుపాయాలు కరువు
ఈ దురవస్థకు, వైద్యుల నిర్బంధ గ్రామసేవ ఒక్కటే విరుగుడు కాబోదు. చాలాచోట్ల ప్రాథమిక వసతుల నిత్యక్షామం వెక్కిరిస్తోంది. తాగునీరు, విద్యుత్తు వంటి మౌలికావసరాలూ తీరనిచోట్ల సేవలందించాలంటేనే ఎందరో బెంబేలెత్తిపోతున్నారు. కొరతల కొలిమిలో మగ్గుతున్న గ్రామాల ముఖచిత్రాన్ని తేజరిల్లజేసే విధ్యుక్త ధర్మ నిర్వహణను ప్రభుత్వాలిక ఎంతమాత్రం ఉపేక్షించే వీల్లేదు. ఊళ్లు తేటపడితే వైద్యుల తలపై మొట్టి నిర్బంధంగా వారిని పల్లెబాట పట్టించాల్సిన అగత్యం ఏముంటుంది? గ్రామాల్లోని భిన్న వాతావరణ స్థితిగతుల్లో రకరకాల వ్యాధుల చికిత్సా పద్ధతుల్లో ఆరితేరితే, ఆ విశేషానుభవం అనంతర కాలంలో వైద్యులకు ఎంతగానో ఉపయుక్తమవుతుంది. స్వచ్ఛందంగా ఆ అవకాశాన్ని వైద్యవిద్యార్థులు అందిపుచ్చుకోగల స్థితిగతులు నెలకొల్పడంలో ప్రభుత్వాలు నెగ్గుకురావాలి!