కేరళ అలప్పుజ చెంగనూర్‌లోని ఓ విగ్రహ కర్మాగారంలో భారీ దోపిడీ జరిగింది. 60 కిలోల పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని దుండగులు దొంగలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విగ్రహం విలువ 2.5 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. చెంగనూర్ తట్టావిల వద్ద ఉన్న పానికర్స్ గ్రానైట్‌లో ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ చోరీ జరిగినట్లు తెలిపారు.
ఆ విగ్రహాన్ని కర్మాగారంలోని కిటికీ చువ్వలను పగలగొట్టి తీసుకుపోయారు. దీనితో పాటు కర్మాగార యజమాని ప్రకాశ్ పనికర్ బంగారు గొలుసును కూడా దొంగలించారు. ఈ అయ్యప్ప విగ్రహాన్ని లండన్‌లోని ఓ ఆలయంలో ప్రతిష్ఠించాలని తయారు చేస్తున్నట్లు యజమానులు తెలిపారు. విగ్రహ తయారీకి కిలో కంటే ఎక్కువ బంగారాన్ని ఉపయోగించినట్లు వెల్లడించారు. చోరీ సమయంలో కర్మాగారంలో ఆరుగురు సిబ్బంది ఉన్నారని విగ్రహాన్ని తీసుకుపోకుండా అడ్డగించిన వారిని దుండగలు కొట్టి తీసుకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఓ ఉద్యోగిని కొట్టాయం మెడికల్ కాలేజీలో, ఇతర ఉద్యోగులను చెంగనూర్ జిల్లా ఆసుపత్రిలో చేర్చారు.
ఈ దోపిడీ విషయంలో కర్మాగరంలో పని చేసిన మాజీ ఉద్యోగి హస్తం ఉన్నట్లు యజమాని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గత ఒకటిన్నర నెలలుగా కర్మాగారంలో పని చేస్తున్న సోనీ అనే డ్రైవర్ ఈ దోపిడీ వెనుక ఉన్నట్లు డిప్యూటీ సూపర్‌ఇండెంట్ ఆఫ్ పోలీస్ (డీవైఎస్‌పీ) బేబీ తెలిపారు. నిందితుల్లో ఐదుగురిని గుర్తించామని... తర్వలోనే వారిని అరెస్టు చేయనున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.