నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్న తమను చెదరగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. ఇందులో భాగంగానే తమపై హత్యాయత్నానికి యత్నిస్తున్నారని తెలిపారు. ఈ నెల 26న నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని భగ్నం చేసేందుకు తమలో నలుగురిపై కాల్పులు జరపాలనే కుట్ర జరిగిందని రైతు సంఘాల నాయకులు తెలిపారు. ఈ కుట్రలో భాగమైన ఓ వ్యక్తిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ముసుగులో ఉన్న సదరు వ్యక్తి.. ఈ కుట్ర గురించి విలేకరుల సమావేశంలో కీలక విషయాలు వెల్లడించాడు. తాము మొత్తం 10 మంది ఉన్నట్లు తెలిపాడు. ఈ నెల 26న జరిగే ట్రాక్టర్ ర్యాలీని భగ్నం చేసేందుకు 90 శాతం అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. దీని గురించి సమాచారాన్ని లీక్ చేస్తే తమ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించినట్లుగా వెల్లడించాడు.
"జనవరి 26న జరిగే ర్యాలీలో మాలో సగం మంది పోలీసుల యూనిఫామ్ ధరించి రైతులను చెల్లాచెదురు చేస్తారు. ఎవరిని కాల్చాలో వారి ఫొటోలు కూడా మాకు అందాయి. మా వెనకాల ఉన్నది ఓ పోలీసు అధికారే. మేం డబ్బుల కోసమే ఈ పని చేసేందుకు అంగీకరించాం. దయచేసి ఈ విషయాన్ని మా కుటుంబ సభ్యులకు తెలియజేయవద్దు. దీని కోసం మాకు తలో రూ.10,000 ముట్టాయి. ఈ ర్యాలీని చెదరగొట్టేందుకు వచ్చే వ్యక్తులు ఎలా ఉంటారో కూడా నేను వివరించాను. ఈ పథకంలో ఆయధాలు సరఫరా చేయడమే నా పని. హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ర్యాలీలోనూ పోలీసు యూనిఫామ్ ధరించి లాఠీ ఛార్జ్ చేయాలని మాకు ఆదేశాలు ఉన్నాయి. మాకు వివిధ, హోటళ్లు, దాబాల్లో దీనికోసం శిక్షణ అందుతుంది."
-- ముసుగు ధరించిన వ్యక్తి
అనంతరం ఆ ముసుగు ధరించిన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు రైతు సంఘాల నాయకులు.
ఇదీ చూడండి:వీడని ప్రతిష్టంభన- ఉద్యమం మరింత ఉద్ధృతం!