దిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది కేంద్రం. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని గుర్తించేందుకు కృషి చేస్తోంది. కేంద్రం నుంచి అందిన సూచనల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తబ్లీగీ జమాత్‌లో పాల్గొన్నవారిని గుర్తించి నిర్బంధ కేంద్రాలకు తరలిస్తున్నాయి. వారికి వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
పుణెలో 60మంది..
నిజాముద్దీన్ మర్కజ్ కార్యక్రమంతో సంబంధమున్న 60 మంది పుణె వాసుల్ని నిర్బంధ కేంద్రాలకు తరలించింది జిల్లా అధికార యంత్రాంగం. వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని సమచారం. అయితే ముందుజాగ్రత్త చర్యగా రక్తనమూనాలను పరీక్షలకు పంపించారు అధికారులు. మొత్తంగా పుణె నుంచి 130మంది నిజాముద్దీన్ మర్కజ్ కార్యక్రమంలో పాల్గొన్నారని.. అయితే మిగిలిన ఆచూకీ లభ్యం కాలేదని అధికారులు చెప్పారు.
రాష్ట్రంలోని మరో పట్టణం అహ్మద్‌నగర్ నుంచి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న 34మందిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వీరిలో 29మంది విదేశీయులని సమాచారం. ఈ విదేశీయుల్లో 14మందికి వైరస్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని.. ఇద్దరికి వైరస్ ఉన్నట్లుగా తేలిందని అధికారులు వెల్లడించారు.
స్వచ్ఛందంగా ముందుకురావాలి..
తబ్లీగీ జమాత్‌లో పాల్గొని తిరిగి తమిళనాడుకు చేరుకున్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోడ్ జిల్లాలోని సుల్తాన్‌పేట్, మనిక్కం పాళెయం, బీపీ అగ్రహారాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. కార్యక్రమంలో పాల్గొన్నవారి వివరాలు ఇవ్వాలని తబ్లీగీ జమాత్ ప్రతినిధులను కోరారు అధికారులు.
కర్ణాటకలో..
మర్కజ్ ప్రత్యేక ప్రార్థనల్లో కర్ణాటక నుంచి 300మంది హాజరయ్యారని వెల్లడించారు రాష్ట్ర ఆరోగ్యమంత్రి బి. శ్రీరాములు. వారిలో 40మందిని గుర్తించి నిర్బంధ కేంద్రాలకు తరలించగా... 12మందికి కరోనా లేదని తేలిందని చెప్పారు. మర్కజ్లో పాల్గొన్నవారిలో 62మంది ఇండోనేషియా, మలేసియా పౌరులు కర్ణాటకలో పర్యటించారని తెలిపారు. వారిలో 12మంది రాష్ట్రం నుంచి వెళ్లిపోయారని.. మిగతా 50మందిని నిర్బంధ కేంద్రంలో ఉంచి పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు.
నిర్వాహకులపై కేసు..
మర్కజ్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కరోనా వ్యాప్తికి కారణమైన ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు. మౌలానా సాద్, డా. జీషాన్, ముఫ్తే షెహజాద్, మహ్మద్ షఫీ, యూనస్, మహ్మద్ సల్మాన్, మహ్మద్ అష్రఫ్‌లపై కేసు పెట్టారు.
క్షమార్హం కాదు..
నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్ ప్రత్యేక ప్రార్థనలపై స్పందించారు కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. ఇది తాలిబన్ తరహా నేరపూరిత ఘటనని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించే సంస్థలు, పౌరులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.
విదేశీయులను వెనక్కి పంపాలి..
తబ్లీగీ జమాత్‌కు హాజరయ్యేందుకు వచ్చిన విదేశీయులను సాధ్యమైనంత త్వరగా వారి దేశాలకు పంపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. కొవిడ్-19 ప్రభావం ఉన్న వారికి అవసరమైన చికిత్స అందించాలని, నిర్బంధ కేంద్రాలకు పంపాలని సూచించింది. కరోనా ప్రభావం లేని వారిని వెంటనే పంపే ఏర్పాటు చేయాలని, ఒకవేళ విమానాలు దొరికే పరిస్థితి లేని పక్షంలో నిర్బంధ కేంద్రాల్లో ఉంచాలని సూచించింది. వీరికి అయ్యే ఖర్చును వారిని తీసుకువచ్చిన సంస్థ ద్వారా చెల్లించేలా ఏర్పాటు చేయాలని పేర్కొంది.
మర్కజ్లో శుద్ధి ప్రక్రియ..
దిల్లీ మర్కజ్లో శానిటైజేషన్ నిర్వహించారు అధికారులు. ఇక్కడ కరోనా విస్తరణ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు రసాయనాలతో శుద్ధి చేశారు.
ఇదీ చూడండి: భారత్‌లో మరిన్ని కరోనా కేసులు- మహారాష్ట్ర టాప్