ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారనే అనుమానంతో ముగ్గురిని ఇంటి నుంచి లాక్కెళ్లి చిత్రహింసలకు గురిచేశారు. ఓ వ్యక్తిని గొంతు కోసి హత్య చేశారు. మరో ఇద్దరిని చితకబాది వదిలేశారు.
జిల్లాలోని జోదాంబా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజురిగూడా గ్రామంలో మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సుమారు 15 మంది మావోయిస్టులు ముగ్గురిని ఊరి శివార్లకు లాక్కెళ్లి, ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు తరలించారు. చనిపోయిన వ్యక్తిని దాసు ఖేముడుగా గుర్తించారు. మావోయిస్టుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
ఇన్ఫార్మర్ల నెపంతో..
పోలీసు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారనే నేపంతోనే ముగ్గురిని లక్ష్యంగా చేసుకున్నారని గ్రామస్థులు తెలిపారు. అందుకే ఇంటి నుంచి లాక్కెళ్లి చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు.
గ్రామస్థులు అందించిన సమాచారం మేరకు ఏడు బాంబులు, ఐఈడీలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకుని, నిర్వీర్యం చేసిన మరుసటి రోజునే ఈ ఘటన జరగటం.. వారి అనుమానానికి బలం చేకూర్చుతోంది.
ఇదీ చూడండి: మన్యంలో అలజడి... వరుస సంఘటనలతో భయాందోళనలు