ఒడిశా కందమాల్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న సీపీఐ(మావోయిస్ట్) స్థావరాన్ని ధ్వంసం చేశాయి భద్రతా బలగాలు. క్యాంపు నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. బలగాలు చేరుకునేసరికే అక్కడి నుంచి మావోయిస్టులు పారిపోయినట్లు వెల్లడించారు.
"అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికపై అందిన సమాచారం మేరకు ఒడిశా మావోయిస్టు అణచివేత దళాలకు చెందిన ప్రత్యేక బలగాలు (ఎల్ఓజీ) కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఫిరింగియా పోలీస్స్టేషన్ పరిధి సమర్బంధ్ గ్రామానికి సమీపంలోని అటవీలో మావోయిస్టుల క్యాంపును గుర్తించారు. అక్కడ నుంచి 15 కిలోల పేలుడు పదార్థాలు, 28 డిటోనేటర్లు, ఐఈడీలు అమర్చేందుకు వినియోగించే టిఫిన్ బాక్సులు స్వాధీనం చేసుకున్నారు."
- ప్రతీక్ సింగ్, కందమాల్ జిల్లా ఎస్పీ
స్థావరంలోని బ్యాగులు, బూట్లు, డాక్యుమెంట్లు, మావోయిస్టు రచనలకు సంబంధించిన పత్రాలనూ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎస్పీ. ఫిరింగియా పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండేళ్లుగా మావోయిస్టుల కదలికలు పెరిగాయన్నారు. వారిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. ఇటీవల సీపీఐ(మావోయిస్ట్)కు చెందిన 15-20 మంది కేకేబీఎన్ డివిజన్ దస్సారు ప్రాంత కమిటీ సభ్యులు సమర్బంధ్ గ్రామ సమీపంలో సమావేశమైనట్లు సమాచారం ఉందన్నారు.
ఇదీ చూడండి: టార్గెట్ చైనా: భారత అమ్ముల పొదిలోకి మరిన్ని అస్త్రాలు