కరోనా కట్టడికి భారత్ చేసిన కృషి ప్రశంసనీయం. గత అనుభవాలతో... విదేశాల నుంచి వచ్చేవారిని విమాన, నౌకాశ్రయాల్లో పరీక్షిస్తున్నారు. 14 రోజులపాటు ఏకాంతం(క్వారంటైన్)లో ఉంచుతున్నారు. అయితే... వైరస్ సోకిన కొందరిలో 24 రోజుల వరకు లక్షణాలు బయటకు కనిపించవు. అలాంటి వ్యక్తులు ముందుగానే ఏకాంతం నుంచి బయటకు వస్తే ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే ముప్పుంది. పరీక్షల్లో జ్వరం వంటి లక్షణాలు బయటపడకుండా కొందరు ఉద్దేశపూర్వకంగా మాత్రలు వేసుకుంటున్నారు. పరీక్షల సమయంలోనూ తమ ఆరోగ్య పరిస్థితిపై తప్పుడు సమచారం ఇస్తున్నారు. మరికొందరు ఏకాంతం నుంచి పారిపోతున్నారు. ఏకాంతం నుంచి బయటకు రాని విధంగా పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
లక్షణాలను దాచొద్దు
దేశవ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూసేశారు. విద్యార్థులు ఎవరిళ్లలో వారుంటే వైరస్ వ్యాప్తి అవకాశాలు తగ్గుతాయన్నది లక్ష్యం. అయితే... చాలామంది బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. ఇది సరికాదు.వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ‘ఇంటి నుంచే పని(వర్క్ ఫ్రం హోం)’ బాగా ఉపయోగపడుతుంది. పలు సాఫ్ట్‌వేర్ సంస్థలు ఇప్పటికే అనుసరిస్తున్నాయి.
అల్పాదాయ వర్గాలకు అండగా నిలవాలి
మన పట్టణాలన్నీ మురికివాడలు, అల్పాదాయ వర్గాల సమూహాలతో కిక్కిరిసిపోయాయి. పేదలంతా పొట్టకూటి కోసం నిత్యం పనిచేయాల్సిందే. వీరి ఇళ్లు, పని ప్రదేశాలు, వీధుల్లో శుభ్రత ప్రమాణాలు అంతంతమాత్రమే. ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అవసరమయితే ఆరు నెలలకు సరిపడా రేషన్ సరకులను ఒక్కసారిగా తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఈ దిశగా ప్రజాపంపిణీ వ్యవస్థను ఆగమేఘాల మీద సిద్ధం చేస్తే అల్పాదాయ వర్గాల వారూ పరిమితంగా అయినా ఇళ్ల వద్దే ఉండేట్లు చూడొచ్చు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి.
పరీక్షల కిట్‌ల కొరత
కరోనా విజృంభిస్తే... బాధితులను పరీక్షించేందుకు కోట్ల కొద్దీ కిట్లు అవసరమవుతాయి. వాటిని మనదేశంలో తయారుచేయడం లేదు. ప్రస్తుతం లక్ష కిట్లు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. ఇక దేశవ్యాప్తంగా నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో రోజుకు తక్కువ సంఖ్యలో నమూనాలనే పరీక్షించొచ్చు. కొవిడ్ నిర్ధారణ పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్‌లను అనుమతించడం కొంత ఊరట. ఎక్కువ కిట్లను అందుబాటులోకి తెచ్చి ఎక్కువ ల్యాబ్‌లను సిద్ధం చేయడం అత్యవసరం.
అసత్య ప్రచారాన్ని కట్టడి చేయాలి
కరోనా వ్యాప్తిపై అసత్య ప్రచారాలు, బూటకపు వార్తలను అడ్డుకోవడం మరో సవాల్. వీటితో జనం భయాందోళనకు లోనవుతారు. రష్యాలో అధికారులు కృత్రిమ మేధస్సు(ఏఐ) సాయంతో సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టారు. మనదేశంలోనూ అలాంటి పర్యవేక్షణ అవసరం.
ఇదీ చదవండి: సుప్రీంలో ఒకే ధర్మాసనం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ