అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు త్వరలో తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. అయోధ్యపై 2010 నాటి తీర్పు అనంతరం ప్రజలను ఐక్యం చేయడంలో రాజకీయ పార్టీలు పరిణతి కనబరిచాయని వ్యాఖ్యానించారు.
నాటి తీర్పు అనంతరం కొంతమంది ఉద్రిక్తతలను సృష్టించాలని చూసినా.. వారికి స్పందన కొరవడిందని పేర్కొన్నారు. తీర్పు అనంతరం న్యాయవ్యవస్థ పట్ల గౌరవభావం పెరిగిందని వ్యాఖ్యానించారు మోదీ. ఆ సమయంలో దేశ ప్రజలు, సంస్థలు ఐక్యంగా ఉండటం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
ఐక్యతా విగ్రహంపై..
2018 అక్టోబర్ 31న సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రారంభించిన సందర్భాన్ని గుర్తు చేశారు ప్రధాని. స్వతంత్ర పోరాటంలో, సంస్థానాలను ఐక్యం చేయడంలో సర్దార్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన ఈ విగ్రహం దేశ గౌరవాన్ని పెంపొందిస్తోందని ఉద్ఘాటించారు.
క్లీన్ సియాచిన్ డ్రైవ్..
సియాచిన్ సరిహద్దులో కాపాలా కాస్తున్న సైనికులు తమ విధులు మాత్రమే నిర్వర్తించడం లేదన్నారు మోదీ. అక్కడ క్లీన్ సియాచిన్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సైనికుల అంకిత భావం పట్ల కృతజ్ఞతలు తెలిపారు మోదీ.
ఇదీ చూడండి: ఆరెస్సెస్ ప్రచారక్... హరియాణాకు రెండోసారి సీఎం