మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. జైపుర్లోని శాసనసభలో రిటర్నింగ్ కార్యాలయంలో నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సమయంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడు అవినాశ్ పాండే మన్మోహన్ వెంట ఉన్నారు.
తనకు రాజ్యసభలో అవకాశం కల్పించడంపై కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు మన్మోహన్. భాజపా నేత మదన్ లాల్ సైనీకి శ్రద్ధాంజలి ఘటించారు. సైనీ జూన్లో మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు ఖాళీగా ఉంది. ఈ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల్లోనే మన్మోహన్ పోటీ చేస్తున్నారు.
కీలక మార్పు....
మూడు దశాబ్దాలుగా అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మన్మోహన్. 1991 నుంచి 2019 వరకు వరుసగా ఐదుసార్లు పెద్దలసభకు వెళ్లారు. జూన్ 14న ఆయన పదవీకాలం ముగిసింది. అసోం నుంచి పోటీ చేసి గెలిచేంత బలం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కాంగ్రెస్కు లేదు. అందుకే రాష్ట్రం మారారు మన్మోహన్.
ఇదీ చూడండి: అరగంట సవాల్ ఓడి.. 57 గంటలకు తిరిగొచ్చాడు!