ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో రౌడీషీటర్ వికాస్ దుబేను ఎన్కౌంటర్ చేసినప్పటి నుంచి పలువురు నేరస్థులు తమని చంపవద్దంటూ ప్లకార్డులు పట్టుకొని పోలీసులకు లొంగిపోతున్నారు. తాజాగా 'సంభల్ పోలీసులకు భయపడుతున్నాను, నా తప్పు తెలుసుకున్నాను.. నేను లొంగిపోతానంటూ' ఓ గ్యాంగ్‌స్టర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ నఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
సదరు వ్యక్తిని రౌడీషీటర్ నయీమ్‌గా గుర్తించారు పోలీసులు. గతంలో అతనిపై ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్స్, యాంటీ సోషల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద పలు కేసులు నమోదయ్యాయి. దీంతో అతని తలపై రూ. 15 వేల రివార్డు ప్రకటించారు అధికారులు. ఈ నేపథ్యంలో తనని ఎన్కౌంటర్ చేసి చంపవద్దంటూ ప్లకార్డు పట్టుకొని పోలీసులకు లొంగిపోయాడు నయీమ్.
ఈ విధంగా ప్లకార్డులతో ఒక నేరస్థుడు పోలీసుల ఎదుట లొంగిపోవటం ఇది మొదటిసారి కాదని స్టేషన్ అధికారి ధరంపాల్ సింగ్ తెలిపారు. అమ్రోహా, కాన్పుర్లలో కూడా నేరస్థులు ఇలాగే లొంగిపోయారని వెల్లడించారు. ఈ మూడు ఘటనల్లోనూ నేరస్థులు వారి భద్రతా కోసం స్థానిక మీడియాను తీసుకొని వచ్చి మరీ స్టేషన్లో సరెండర్ అయ్యారని పేర్కొన్నారు.