కేరళ ఎర్నాకులం జిల్లాలోని పచలంలో ఓ ఆటో డ్రైవర్ చేసిన పెట్రోలు దాడిలో.. తీవ్రగాయాల పాలైన హెల్త్ వర్కర్ శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు రిజిన్ దాస్(34) బాగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు వైద్యులు.
ఘటనలో గాయపడిన పంగజాక్షన్ అనే మరో వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ జరిగింది
రెండు రోజుల క్రితం ఫిలిప్ అనే ఆటో డ్రైవర్.. రిజిన్పై దాడికి పాల్పడ్డాడు. ఓ టీ దుకాణం వద్ద ఉన్న రిజిన్పై.. పెట్రోల్ చల్లి విచక్షణ రహితంగా నిప్పంటించాడు. అడ్డొచ్చిన వారిపైనా దాడికి యత్నించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు ఫిలిప్. చివరకు పచలంలోని కర్షక రోడ్డు ప్రాంతం వద్ద తనపై తానే దాడి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసిన దాడి కాదని.. పోలీసులు స్పష్టం చేశారు. ఫిలిప్ మానసిక పరిస్థితి సరిగా లేక పోవడం వల్లే ఈ ఘటనకు ఒడిగట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.